* అన్ని పార్టీలతోనూ చర్చిస్తాం
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : త్వరలో జిల్లాల పునర్విభజన కోసం కమిటీ వేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanthreddy) తెలిపారు. విశ్రాంత జడ్జి నేతృత్వంలో ఈ కమిటీ ఉంటుందన్నారు. ఈ కమిటీ రాష్ట్రమంతా తిరిగి అభిప్రాయాలు సేకరిస్తుందని వెల్లడించారు. జిల్లాల సరిహద్దులు మార్చాలని విజ్ఞప్తులు వస్తున్నాయని, రాచకొండ కమిషనరేట్ పేరు సహేతుకంగా లేదని పేర్కొన్నారు. గతంలో జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు అడ్డగోలుగా జరిగిందన్నారు. వాటిని పెంచడం, తగ్గించడం, రేషనలైజ్ చేయడంపై కమిటీ వివరాలు స్వీకరిస్తుందని చెప్పారు. జిల్లాల పునర్విభజన కమిటీ ఏర్పాటుపై అన్ని రాజకీయ పార్టీలతోనూ చర్చిస్తామన్నారు. అసెంబ్లీలో పెట్టి అందరితోనూ మాట్లాడిన తర్వాతే కమిటీ వేస్తామన్నారు. రాచకొండ పేరు రాచరిక పాలనకు గుర్తుగా ఉందని మార్చామన్నారు. సికింద్రాబాద్ విషయంలో తాను వచ్చాక చేసిందేమి లేదని చెప్పారు. గతంలో కూడా సికింద్రాబాద్ జీహెచ్ ఎంసీలో అంతర్భాగంగా ఉందన్నారు. సికింద్రాబాద్ (Secunderabad) పేరును విడగొడుతున్నానని అంటున్నారని, తాను అసలు ఆ దిశగానే ఆలోచించలేదన్నారు. గతంలో ఎలాగుందో ఇప్పుడూ అది అలాగే ఉందని వివరణ ఇచ్చారు.
…………………………………………………..

