* ప్రజా ప్రభుత్వమని నిరూపిస్తాం
* సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయ్యేసరికి లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి, ఇది ప్రజా ప్రభుత్వమని నిరూపిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangan Cm Revanthreddy) హామీ ఇచ్చారు. హుస్నాబాద్ లో జరిగిన సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో ఆ పార్టీ హుస్నాబాద్‌ను విస్మరించి రాష్ట్రంలోని గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలను మాత్రమే అభివృద్ధి చేసిందని ఆరోపించారు. తెలంగాణలో నియంతృత్వ BRS పాలనను తమ పార్టీ గద్దె దించింది. ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా తమ ప్రభుత్వం తెలంగాణ ఆకాంక్షలను నెరవేరుస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడు సంవత్సరాలలోనే కూలిపోయిందని తెలిపారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను నిర్మించిందని, అవన్నీ దశాబ్దాలుగా బలంగా ఉన్నాయని గుర్తు చేశారు. హుస్నాబాద్ కు భారీగా నిధులు హుస్నాబాద్ అభివృద్ధికి భారీ నిధులను ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసి, పెరుగుతున్న రుణ భారం నుంచి వారిని విముక్తి చేసిందని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంత్రులతో, ఎమ్మెల్యేలతో పని చేయించుకునే వారిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ముక్కకో, మందుకో లొంగిపోతే నష్టం జరుగుతుందని వెల్లడించారు.
……………………………………………..
