* అదానీ గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు
* రాజ్‌భవన్, రాష్ట్రపతిభవన్ ఎక్కడ ధర్నా చేసినా భయపడేది లే
* ఎందుకు ధర్నా చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి..
* ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఏమైంది
* విద్యుత్ కొనుగోళ్ల అంశం ఏమైంది
* కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నల వర్షం
ఆకేరు న్యూస్, ఢిల్లీ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTHREDDY) తీరు గురివింద గింజలా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (CENTRAL MINISTER KISHANREDDY) విమర్శించారు. అదానీ గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదని తెలిపారు. ఎందుకు ధర్నా చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని, కేంద్ర ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని నిరూపించగలరా అని ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై తెలంగాణలో రేవంత్ ధర్నా చేయడంపై ఆయన ఢిల్లీ(DELHI)లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్ ధర్నా చేయడం సిగ్గుచేటని విమర్శించారు. రేవంత్ ధర్నాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. అదానీతో రేవంత్ ఎందుకు కాంట్రాక్టులు చేస్తుకున్నారని అన్నారు. అదానీనీ కలిసి ఎందుకు ఫొటోలు దిగారో రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. అదానీ అంశంలో చేస్తున్న ఆరోపణల్లో ఒక్క ఆధారమైనా చూపగలరా అన్నారు. రాజ్‌భవన్(RAJ BHAVAN), రాష్ట్రపతిభవన్(RASTRAPATHI BHAVAN) ఎక్కడ ధర్నా చేసినా భయపడేది లేదని తెలిపారు. అవినీతి విషయంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ రెండూ ఒక్కటే అని చెప్పారు. ప్రజల సమస్యలపై స్పందించడం మానేసి.. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేద్దామా.. హైడ్రాతో ఇళ్లు కూలుద్దామా.. అని సెన్సేషన్ కోసం రేవంత్ ఆలోచిస్తున్నారని విమర్శించారు.
రాహుల్‌కు అవగాహనే లేదు
దేశం మొత్తం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పరువు కోల్పోతున్నా.. బుద్ధిరావడం లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. పార్లమెంట్లో రాహుల్‌గాంధీ తీరును చూస్తే అర్థం అవుతుందని అన్నారు. రాహుల్‌గాంధీ(RAHUL GANDHI) రాజకీయ వ్యవహరమే ఇందుకు కారణం అన్నారు. మిడిమిడి జ్ఞానంతో రాహుల్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయనకు దేశ సమస్యలు, దేశ చరిత్ర, వర్తమాన రాజకీయాలపై అవగాహన లేదని ఆరోపించారు. రేవంత్, రాహుల్ తీరుకు భారత ప్రభుత్వం భయపడదని చెప్పారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ వైపే ఉన్నాడని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఏమైంది.. విద్యుత్ కొనుగోళ్ల అంశం ఏమైంది.. అని ప్రశ్నల వర్షం కురిపించారు.
……………………………………………..