
* దసరా కిక్కు మామూలుగా లేదుగా..
* పండగ చేసుకున్న మందుబాబులు
* గాంధీ జయంతి రోజుకు ముందు రోజే స్టాక్
* ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
అయ్యో.. ఈసారి దసరా, గాంధీ జయంతి రోజు (అక్టోబర్ 2) ఒకేసారి వచ్చాయి. అంటే.. పండుగ రోజున చుక్క.. ముక్క బంద్ ఉంటాయని చాలా మంది భావించారు. బంద్ గింద్ జాన్తా నై.. పండగంటే పండగ చేసుకోవాల్సిందే.. అని మందుబాబులు ఎక్కడా తగ్గలేదు. గాంధీ జయంతికి ముందే ఫుల్ గా స్టాక్ పెట్టుకున్నారు. చుక్కేస్తూ దసరాను ధూంధాంగా జరుపుకున్నారు. మూడు రోజుల్లోనే తెలంగాణలో రూ.697 కోట్లు తాగేశారంటే ఏ స్థాయిలో కిక్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే సెప్టెంబరు నెలలో ఏకంగా ₹3,048 కోట్లు అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. సెప్టెంబర్ 29 , అక్టోబర్ 1 మధ్య రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి.
60–80% అధికం
తెలంగాణ మొత్తంగా దసరా సీజన్లో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. గతేడాది కంటే అధికంగానే అమ్మకాలు జరిగాయి. గతేడాది సెప్టెంబర్ లో ₹2,838 కోట్ల మద్యం అమ్మకాలు జరిగితే, ఈ ఏడాది సెప్టెంబరులో ₹3,048 కోట్లు జరిగాయి. అంటే గతం కంటే కంటే 7% అదనంగా అమ్మకాలు జరిగాయి. అంతేకాదు.. అక్టోబర్ 2న గాంధీ జయంతి (అదే రోజు దసరా) డ్రై డే కోసం ముందుగానే వినియోగదారులు మద్యాన్ని కొని దాచి పెట్టుకున్నారు. కేవలం మూడు రోజుల్లోనే మద్యం అమ్మకాలు సుమారు ₹697 కోట్లకు చేరుకున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈ పెరుగుదల 60–80% ఎక్కువ ఉండడం గమనార్హం. అంటే.. అక్టోబర్ 2న మద్యం దొరకదని కాస్త ఎక్కువగానే కొని పెట్టుకున్నట్లు స్పష్టం అవుతోంది.
మందుబాబుల ముందు చూపు
సెప్టెంబర్ 29, ₹278 కోట్లు, సెప్టెంబర్ 30న ₹333 కోట్లు, అక్టోబర్ 1న ₹86.23 కోట్లు అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ నివేదికలు చెబుతున్నాయి. మందుబాబులకు ఎంత ముందు చూపు అంటే.. గాంధీ జయంతి ముందు రోజున రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి అంతకు రెండు రోజుల ముందే భారీగా మద్యం కొనుగోలు చేసినట్లు ఈ గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఇక వాల్యూమ్ల పరంగా, ఇండియన్ మేడ్ లిక్కర్ అమ్మకాలు సెప్టెంబర్ 2024లో 28.81 లక్షల కేసుల నుండి ఈ సంవత్సరం 29.92 లక్షల కేసులకు పెరిగాయి. అయితే, బీరు వినియోగం తగ్గింది, గత సంవత్సరం 39.71 లక్షల కేసుల నుండి 2025లో అమ్మకాలు 36.46 లక్షల కేసులకు తగ్గాయి.
………………………………………