
– హైదరాబాద్‌లో ఇదో దందా
– మహళల నుంచి అండాల సేకరణ
– హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌కు తరలింపు
– కాసులకోసం అడ్డుదారులు
– భవిష్యత్ తరాలకు ముప్పు అంటున్న సామాజికవేత్తలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
దేశంలో.. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు లేని దంపతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కాలుష్యం, ఆహార అలవాట్లు, ఒత్తిళ్లతో చాలా మంది పిల్లలకు దూరం అవుతున్నారు. దీంతో ‘మాతృత్వపు అనుభూతులు పొందాలా.., పెళ్లయి పదేళ్లు దాటినా పిల్లలు లేరా.. అయితే మమ్మల్ని సంప్రదించండి’ అంటూ సంతాన సాఫల్య కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటిలో కొన్ని నిజంగానే పిల్లలు కలగని దంపతులకు ఆధునిక చికిత్సల ద్వారా సంతానభాగ్యం కలిగిస్తున్నా, చాలా సెంటర్లు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నాయి. అలాగే.., మరికొందరు పురుషుల వీర్యం, మహిళల అండాలతో వ్యాపారం చేస్తున్నారు.
వీర్యానికి 4వేలు.. నిబంధనలు వర్తిస్తాయ్..
సికింద్రాబాద్‌లో సృష్టి టెస్ట్‌ట్యూబ్ బేబే సెంటర్ చేసిన నిర్వాకం తెలిసిందే. ఆ ఘోరం మరువకముందే హైదరాబాద్‌లోనే మరో దందా వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్‌తో లింకు పెట్టుకుని వారికి పురుషుల వీర్యాన్ని, మహిళల అండాలను విక్రయిస్తున్నారు. వీర్యదాతల నుంచి సేకరించిన వీర్యాన్ని అక్కడకు తరలిస్తున్నారు. వీర్యం ఇచ్చినవారికి రూ.2 వేల నుంచి రూ.4వేలు ఇస్తున్నారు. వీర్యదాతలకు నిర్వాహకులు కొన్ని షరుతుల కూడా పెడుతున్నట్లు తెలుస్తోంది. వీర్యం ఇచ్చేవారు వారం ముందు నుంచీ ఎవరితోనూ శారీరకంగా కలవకూడదు. వారానికి ఒక్కసారే వీర్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అనుకోకుండా ఆసక్తి సన్నగిల్లితే.. వీర్యం ఇచ్చే వారికి మూడ్ వచ్చేలా ఏర్పాట్లు కూడా చేస్తారట.
డబ్బు ఆశచూపి..
డబ్బు ఆశచూపించి పురుషుల నుంచి వీర్యాన్ని, మహిళల నుంచి అండాలను సేకరించి హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్‌లో ఫెర్టిలిటీ సెంటర్‌కు తరలిస్తున్న ముఠాను గోపాలపురం పోలీసులు పట్టుకున్నారు. ముఠాలో ఉన్న ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి స్పెర్మ్ బ్యాంకులో ఉన్న వైద్య యంత్రాలు, రిజిస్టర్లు, శ్యాంపిల్ బాటిళ్లతో పాటు సరోగసీ ఆప్లికేషన్లు స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ ఈస్టుమెట్రో స్టేషన్ సమీపంలో బ్లూ సీ హోటల్ పై అంతస్తులో ఇండియన్ స్పర్మ్టెక్ క్రయోసిస్టం క్లినిక్‌లో ఈ దందా నడుస్తోంది. దానికి పంకజ్ సోని మేనేజర్/యజమానిగా వ్యవహరిస్తున్నారు. కొంత మందిని తన వద్ద ఉద్యోగులుగా, ఏజెంట్లుగా టెక్నీషియన్లుగా నియమించుకున్నాడు. వారి సహకారంతో అమాయక ప్రజలకు డబ్బు ఆశ చూపించి వారి నుంచి వీర్యం, అండాలను సేకరిస్తున్నారు. సేకరించిన అండాలు, స్పెర్మ్‌ను అహ్మదాబాద్‌లోని ఫెర్టిలిటీ సెంటర్‌కు తరలిస్తున్నారు.
భవిష్యత్ తరాలకు ముప్పు
హైదరాబాద్‌లో కొత్త తరహా దందా వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ అక్రమ దందా సెంటర్లపై నిఘా ఉంచనున్నారు. అనుమానం ఉన్న కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. సరోగసి ముసుగులో చిన్నారులను విక్రయిస్తున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి రావడంతో సీరియస్‌గా దృష్టి సారించారు. పిల్లలు లేని దంపతులే లక్ష్యంగా హైదరాబాద్‌లో సాగుతున్న ఇటువంటి దందాలను అరికట్టకపోతే భవిష్యత్తరాలకు ముప్పు వాటిల్లుతుందని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
……………………………………………..