 
                * దెబ్బతిన్న ఇళ్లకు రూ. 15 వేల ఆర్థిక సాయం
* నష్టపోయిన బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు
* పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి రూ. పది వేలు
* వరంగల్లో సీఎం రేవంత్ మీడియా సమావేశం
ఆకేరు న్యూస్ హనుమకొండ : మొంథా తుఫాన్ వల్ల నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన వరంగల్లో ముంపు ప్రాంతాల్లో పర్యటించి హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాలకు నష్టపోయిన కుటుంబాలను ఆదుకుంటామన్నారు. మృతి చెందిన కుటుంబాలకు రూ. ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని, వరదలకు ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ. 15 వేలు ఇవ్వనున్నట్లు వివరించారు. అవసరమైన వారికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు. పంట నష్టపోయిన వారికి ఎకరానికి రూ. పది వేలు తక్షణ ఆర్థిక సాయం చెల్లిస్తామని చెప్పారు. వరద ధాటికి పొలాల్లో ఇసుక మేటలు వేస్తే.. ఎకరాకు రూ. లక్ష ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కలెక్టర్లు వరద నష్టంపై త్వరగా నివేదికలు తయారు చేస్తే కేంద్రానికి పంపిస్తామన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. కలెక్టర్లు కూడా బాధితులను స్వయంగా కలిసి మాట్లాడాలన్నారు. అధికారులు తప్పు చేస్తే బదిలీలతో సరిపెట్టమన్నారు. అధికారుల పనితీరుపై వార్షిక నివేదిక తయారు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలసత్వం వహించిన అధికారులపై నివేదిక ప్రకారం చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరించారు.
…………………………………………….

 
                     
                    