*వదంతులతో వినియోగదారులు *పానిక్*
ఆకేరు న్యూస్, హనుమకొండ : ఒక వైపు పెట్రోల్ కొరత లేదని ప్రభుత్వాలతోపాటు కేంద్ర పెట్రోలియం శాఖ చెబుతున్నా బంకుల వద్ద వినియోగదారులు క్యూలు కడుతున్నారు. రిఫైనరీల నుండి సరఫరా సక్రమంగా ఉందని, రాష్ట్ర అవసరాలకు మించి పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ పౌరసరఫరాల శాఖ తెలిపింది. వారం రోజుల పాటు పెట్రోల్ బంకులు మూసివేస్తారని సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల కారణంగా తెలంగాణ వ్యాపంగా ప్రధాన నగరాలు, వాటి చుట్టు పక్కల ప్రాంతంల్లోని పెట్రోల్ బంకుల వద్ద రెండు రోజులుగా భారీ క్యూలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోతుందనే తప్పుడు సమాచారం ప్రచారం అవుతోంది. దీనికితోడు ఇరాన్‌తో శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఐదురోజలు కాల్పులు ఆపుతున్నట్టు అమెరికా ప్రసిడెంట్ ట్రంప్ ప్రకటించడం.. ఈ విషయాన్ని ఇరాన్ ఖండించడంతో ఏర్పడిన గందరగోళ పరిస్థితులు కూడా ప్రజలు ఆందోళన చెందడానికి కారణంగా మారింది.
కొరత భయంతో కొనుగోళ్లు
బంకులు మూసివేస్తే పరిస్థితి ఏమిటనే భయంతో ప్రజలు ముందస్తు జాగ్రత్తగా
పెట్రోల్ కొనుగోళ్లకు ఎగబడడంతో ఒక్కసారిగా బంకుల వద్ద విపరీతమైన రద్దీ కనిపిస్తోంది.
కొందరు వాహనదారులు తమ వాహనాల ట్యాంకులు ఫుల్ చేసుకోవడమే కాకుండా, ప్లాస్టిక్ డ్రమ్ములు, బాటిళ్లలో నిల్వ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సాధారణం కంటే రెండున్నర నుంచి మూడు రెట్లు ఇంధన కొనుగోళ్లు జరుగుతున్నట్లు సమాచారం.
‘నో స్టాక్’ బోర్డులతో..
కొన్ని బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇందుకు ఇంధన కొరత కాదు కారణం. వాహనదారులు అకస్మాత్తుగా పెద్ద సంఖ్యలో రావడంతో బంకుల్లో ఉన్న రోజువారీ నిల్వలు త్వరగా అయిపోవడం.. తిరిగి రీఫిల్ చేయడానికి అవసరమైన పేమెంట్ చెల్లింపుల ప్రక్రియ నేపథ్యంలో స్వల్ప జాప్యం కారణంగానే ఇలా జరిగిందని బంకుల నిర్వాహకులు చెబుతున్నారు.
