
* తెలంగాణ స్వరాష్ట్రంలో ఇదే ప్రథమం
* కాళేశ్వరానికి ఆధ్యాత్మిక కళ
* త్రివేణి సంగమంలో ఘనంగా ఏర్పాట్లు
* తెల్లవారుజామునే మొదలైన పుష్కర స్నానాలు
* నేడు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి రాక
* 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహం ఆవిష్కరణ
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
తెలంగాణలోని జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏర్పాటైన తర్వాత తొలిసారి సరస్వతీ నది పుష్కరాలకు అంకురార్పణ జరగనుంది. ఈ వేడుకతో కాళేశ్వరం ఆధ్యాత్మిక కళతో వెలుగొందనుంది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ పుష్కరాలు.. 12 రోజుల పాటు దేదీప్యమానంగా జరిగేలా తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేసింది. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి సరస్వతీ నది పండుగను జరుపుతారు. సరస్వతీ నదిని “అంతర్వాహిని” (అదృశ్య నది)గా పరిగణిస్తారు, ఇది త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద. గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతి అనే మూడు నదులు ఇక్కడ కలుస్తాయని ప్రజలు నమ్ముతారు.
ఇతర రాష్ట్రాల నుంచి సైతం..
పుష్కర కాలం హిందువులకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. తర్పణం వంటి ఆచారాలను ఆచరించడం ద్వారా మన పూర్వీకులను ప్రార్థించడానికి మరియు గౌరవించడానికి కూడా ఇది మంచి సమయమని పండితులు చెబుతారు. కాళేశ్వరంలో మూడు నదుల సంగమం ప్రదేశాన్ని ఆధ్యాత్మిక పరంగా శక్తివంతం చేస్తుంది. పుష్కరాల సమయంలో పవిత్ర స్నానం చేయడం వల్ల ఆధ్యాత్మిక శుద్ధి లభిస్తుందని నమ్ముతారు. పుష్కర కాలంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, శ్రీ మహా సరస్వతి అమ్మవారి ఆలయం వంటి ప్రధాన ఆలయాలలో వివిధ రకాల హోమాలు, పూజలు నిర్వహిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు పుష్కరాల్లో పాల్గొనే అవకాశముంది.
పుష్కర స్నానాలు ప్రారంభం
ముహూర్తం ప్రకారం గురువారం తెల్లవారుజామున 5:44 గంటలకు శ్రీ గురు మదనానంద సరస్వతీ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలతో సరస్వతీ పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. గురువారం సూర్యోదయం నుంచి ఈ నెల 26 వరకూ 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాల ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పుష్కరాల ప్రతి రోజూ ఒక పీఠాధిపతి పుణ్యస్నానాలు ఆచరిస్తారని తెలిపారు. పుష్కర ఏర్పాట్ల కోసం కేటాయించిన రూ.35 కోట్లతో వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ దేవాదాయశాఖ పుష్కర ఘాట్లు, మరుగుదొడ్లు, మంచినీటి వసతి, టెంట్ సిటీ, రోడ్ల మరమ్మత్తులు, పార్కింగ్, పారిశుద్ధ్యం తదితర పనులు చేపట్టింది. హైదరాబాద్ మొదలు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపనున్నది. ఎటువంటి అవాంచనీయ ఘటనలకు చోటు లేకుండా పోలీసుశాఖ కట్టుదిట్టమైనభద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు
ప్రధానఘాట్ వద్ద మహబలిపురం నుంచి తీసుకొచ్చిన 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని సాయంత్రం నాలుగు గంటలకు సీఎం ఎ.రేవంత్రెడ్డి ఆవిష్కరిస్తారు. అటుపై సరస్వతి నదిలో పుష్కర స్నానం చేసి, కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం 5:30 గంటలకు పుష్కర ఘాట్లో సరస్వతి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం కాళేశ్వరంలో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా సరస్వతి ఘాట్ సమీపంలో సీఎం రేవంత్రెడ్డి వచ్చే హెలికాప్టర్ దిగడానికి హెలీప్యాడ్ నిర్మించారు.
……………………………………………………