Sathankulam custodial death verdict police
* తండ్రీకొడుకుల హత్య కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ మదురై కోర్టు సంచలన తీర్పు.
* లాక్డౌన్ వేళ అమానవీయంగా వ్యవహరించిన పోలీసులపై ‘రేరెస్ట్ ఆఫ్ రేర్’ కింద చర్యలు.
* ఆమె ఆరేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం
ఆకేరు న్యూస్ , ప్రత్యేక ప్రతినిధి :
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన తమిళనాడు తూత్తుకుడి జిల్లా సాతాన్కుళం తండ్రీకొడుకుల లాకప్ డెత్ కేసులో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. పోలీసు కస్టడీలో జయరాజ్ (58), ఆయన కుమారుడు బెనిక్స్ (31) మరణానికి కారణమైన తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ మదురై సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. పోలీసుల క్రూరత్వానికి ఇది తగిన శాస్తి అని బాధితుల కుటుంబ సభ్యులతో పాటు పౌర సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది.
* నేపథ్యం: ఏం జరిగింది?
2020 జూన్ 19న లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి, అనుమతించిన సమయం కంటే అదనంగా మొబైల్ షాపు తెరిచి ఉంచారన్న ఆరోపణతో సాతాన్కుళం పోలీసులు తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో వీరిద్దరిపై పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. రాత్రంతా లాఠీలతో తీవ్రంగా కొట్టడం, చిత్రహింసలకు గురిచేయడంతో వారి పరిస్థితి విషమించింది. ఫలితంగా జూన్ 22న బెనిక్స్, జూన్ 23న ఆయన తండ్రి జయరాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
* తీర్పు వివరాలు
తమిళనాడు ప్రభుత్వం ఈ కేసును తొలుత సీబీసీఐడీకి, అనంతరం సీబీఐకి అప్పగించింది. అప్పటి ఇన్స్పెక్టర్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్లతో పాటు మరో ఆరుగురు పోలీసులను నిందితులుగా గుర్తించారు.
* రక్షకులే భక్షకులైన వేళ :
రక్షించాల్సిన వారే భక్షకులుగా మారి, నిస్సహాయులైన వ్యక్తులను కిరాతకంగా చంపడం క్షమించరాని నేరం” అని కోర్టు అభివర్ణించింది.
* అత్యంత అరుదైన కేసు (Rarest of Rare) గా పరిగణిస్తూ 9 మందికి ఉరిశిక్ష ఖరారు చేసింది.
బాధితుల కుటుంబానికి నిందితుల నుండే 1.40 కోట్ల రూపాయల పరిహారాన్ని వసూలు చేసి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
* ఒక తల్లి వీరోచిత పోరాటం
సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన జయరాజ్ భార్య సెల్వరాణి, తన భర్త మరియు కుమారుడి మరణానికి న్యాయం కోరుతూ ఆరేళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశారు. పోలీసుల ఒత్తిళ్లకు లొంగకుండా, సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఆమె చేసిన పోరాటం దేశవ్యాప్తంగా మద్దతు పొందింది.
> “న్యాయం ఆలస్యమైనా.. సరైన తీర్పు వచ్చింది. నా భర్త, కొడుకు ప్రాణాలు తీసిన వారికి ఈ శిక్ష సరైనదే. ఇకపై ఏ కుటుంబానికి ఇలాంటి పరిస్థితి రాకూడదు.” – సెల్వరాణి (బాధిత భార్య)
>
లాకప్ డెత్ కేసుల్లో ఒకేసారి తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష పడటం భారత న్యాయ చరిత్రలో అత్యంత కీలక పరిణామంగా నిలిచిపోనుంది.
————————–
