* అభివృద్ధి పనుల పరిశీలన
ఆకేరు న్యూస్, ములుగు జిల్లా : తెలంగాణలో అతిపెద్ద పండుగగా పేరున్న మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. గతానికి భిన్నంగా భక్తులకు సేవలు అందించాలని జాతరకు ముందే అభివృద్ధి పనులను కూడా ప్రారంభించింది. వాటిని జాతర ప్రారంభం లోగా పూర్తి చేయించాలని అధికారులకు టార్గెట్ విధించింది. పనులు జరుగుతున్న తీరు మంత్రులు సీతక్క, పొంగులేటి తదితరులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తాజాగా అర్ధరాత్రి వేళ కూడా మంత్రి సీతక్క పనుల పరిశీలనకు వెళ్లారు. నిన్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే.. ములుగు బయలుదేరిన సీతక్క అర్ధరాత్రి 12 గంటల సమయంలో పనులు జరుగుతున్న చోటుకు వెళ్లారు. గద్దెల ప్రాంతంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులను జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ను అడిగి తెలుసుకున్నారు. ముందస్తు మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని ఆదేశించారు. మంత్రి వెంట ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ములుగు డీఎస్పీ రవీందర్ తదితరులు ఉన్నారు.
…………………………………………….
