ములుగు మునిసిపాలిటీ పీఠం పై ఇద్దరు
*
* తొలి చైర్మన్ ఎవరో రేపు తెర పడనున్న ఉత్కంఠ
ఆకేరు న్యూస్,ములుగు:
ములుగు చైర్ పర్సన్ పదవి ఇద్దరు పంచుకోనున్నారా..? అంటే అవును అన్న సమాచారం ప్రచారంలో ఉంది. ఐదు సంవత్సరాల పదవీ కాలంలో రెండున్నర సంవత్సరాలు ఒకరు, మరో రెండున్నర సంవత్సరాలు మరొకరు పదవీ బాధ్యతల్లో ఉండాలన్న నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయం రేపటి ఎన్నికతో తేలిపోనున్నది. బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఈ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు నలుగురు మహిళా కౌన్సిలర్లు బరిలోకి దిగడంతో పార్టీ అంతర్గతంగా పోటీ ఆసక్తికరంగా మారింది. మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గాన కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది.
* చైర్మన్ పదవీ రేసులో వీరే..
బీఆర్ఎస్ ఐదు స్థానాలు, స్వతంత్రులు రెండు స్థానాలు, బీజేపీ ఒక స్థానంతో సరిపెట్టుకున్నాయి. దీంతో చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది. అయితే కాంగ్రెస్ పార్టీలో నలుగురు మహిళా కౌన్సిలర్లు పీఠం కోసం పోటీ పడుతున్నారు. అయితే చైర్మన్ రేసులో ఎనిమిదో వార్డు నుంచి ఎన్నికైన నల్లెల్ల స్వాతి భరత్ కుమార్ ఆరో వార్డు నుంచి గెలిచిన చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి, ప్రధానంగా ఉన్నారు. కాగా నాలుగో వార్డు నుంచి గెలిచిన గుంటోజు పావని నిరంజన్ చారి, మూడో వార్డు నుంచి విజయం సాధించిన యాసం వసంత రవికుమార్ లు కూడా పోటీలో ఉన్నారు.
ఈ నలుగురూ తమ తమ రాజకీయ నేపథ్యం, వర్గాల మద్దతుతో మంత్రి సీతక్క వద్ద తీవ్రంగా లాబీయింగ్ చేసినట్లు సమాచారం. నల్లెల్ల స్వాతి కుటుంబానికి ప్రాంతీయంగా మంచి రాజకీయ చరిత్ర ఉండగా, గుంటోజు పావని స్వాతంత్ర్య సమరయోధుడు గుంటోజు నరసయ్య కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం ఆమెకు బలంగా మారింది. యాసం వసంత కుటుంబానికి మంత్రి సీతక్కతో సన్నిహిత సంబంధాలు ఉండగా, చంద్రకళ భర్త బిక్షపతి పార్టీకి దీర్ఘకాలంగా సేవలందిస్తున్న నాయకుడిగా గుర్తింపు పొందారు.
రెండు రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం పార్టీలో సమతుల్యతను కాపాడే విధంగా ఒక కీలక ఫార్ములా రూపుదిద్దుకున్నట్లు సమాచారం. ఈ ఫార్ములా ప్రకారం నల్లెల్ల స్వాతి భరత్ కుమార్, చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి మధ్య చైర్మన్ పదవిని రెండున్నర సంవత్సరాల చొప్పున పంచే ప్రతిపాదనకు సభ్యుల నుంచి సానుకూల స్పందన లభించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఇద్దరికీ అవకాశం కల్పించడం ద్వారా పార్టీలో అసంతృప్తిని నివారించాలన్న వ్యూహం అమల్లోకి రావచ్చన్న చర్చ సాగుతోంది.తొలి రెండున్నర సంవత్సరాలు చైర్మన్గా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది రేపటి ఎన్నికతో స్పష్టత రానుంది. ఒకే పదవిని ఇద్దరికి పంచే విధానం స్థానిక రాజకీయాల్లో అరుదుగా కనిపించే పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అంతర్గత ఐక్యతను కాపాడేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.
————————
