* కండువా కప్పి ఆహ్వానించిన రామచంద్రరావు, కిషన్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీనియర్ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు. హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. రాజకీయ జీవితానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమని మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా గర్వించదగ్గ స్థాయికి చేరుకుందని, ఆయన అడుగుజాడల్లో నడవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. మోదీ ప్రభుత్వం సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని ఆమె పేర్కొన్నారు. పదవుల కోసం కాకుండా, కేవలం సామాన్య ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. కాగా, 1992లో ‘జంబలకిడిపంబ’ సినిమాతో గుర్తింపు పొందిన ఆమను, ఆ తర్వాత తెలుగు చిత్రసీమలో అగ్ర నటిగా ఎదిగారు. ‘శుభలగ్నం’, ‘మావిచిగురు’, ‘శుభ సంకల్పం’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ‘మిస్టర్ పెళ్లాం’ చిత్రంలో ఆమె నటనకు గాను ప్రతిష్టాత్మక నంది అవార్డు లభించింది. ఆమెతో పాటు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ శోభలత కూడా బీజేపీలో చేరారు.
……………………………………….

