
* మద్దతు ధరలు రాక దళారులను ఆశ్రయిస్తున్న రైతులు
* వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన హరీష్ రావు
ఆకేరున్యూస్, సిద్దిపేట: వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని హరీశ్‌రావు సందర్శించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట వంటి జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు- చేయకపోవడం వల్ల రైతులు దళారులకు అమ్ముకుంటున్నారని అన్నారు. క్వింటాకి 2,320 రూపాయలు మద్దతు ధర రావాల్సి ఉండగా దళారులకు 2 వేలు, 2,100 రూపాయలకే అమ్ముకుంటున్నారని చెప్పారు. ఇది రైతు కంటక ప్రభుత్వం అని హరీశ్‌రావు అన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మందికి చేయలేదని.. రైతు బంధుని వానకాలంలో ఎగ్గొట్టి యాసంగిలో రెండు మూడు ఎకరాలకే ఇచ్చారని తెలిపారు.అకాల వర్షాలు, వడగండ్ల వానల భయంతో రైతులు కల్లాల్లోనే ధాన్యాన్ని దళారులకు అమ్ముకునే దుస్థితి నెలకొందని హరీశ్‌రావు అన్నారు. గతేడాది వానాకాలంలో
మొత్తం 1 లక్షా 53 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పి, కేవలం 52 వేల మెట్రిక్ టన్నులే సేకరించగలిగిందని అన్నారు. మిగతా 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బయటకు వదిలేసిందని.. అంటే మూడొంతుల్లో ఒక వంతు మాత్రమే కొనుగోలు చేయగలిగిందని అన్నారు. రెండొంతుల ధాన్యాన్ని రైతులు తక్కువ ధరకు అమ్ముకున్నారని చెప్పారు. యాసంగి పంటకు కూడా ప్రభుత్వంలో అదే నిర్లక్ష్యం కనబడుతోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, గాలి దుమారం వల్ల మూడు నాలుగు లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. అందుకు ఎకరాకి 20 వేల రూపాయలను ఇన్పుట్ సబ్సిడీగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్ల ద్వారా నివేదిక తెప్పించుకొని రైతులను ఆదుకోవాలన్నారు. నంగునూరు మండలం పాలమాకుల వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్లు కొని వారం అయినా ఇంకా రైతులకి డబ్బులు ఇవ్వలేదని హరీశ్‌రావు మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 48 గంటల్లో రైతులకు డబ్బులను అకౌంట్లో వేస్తున్నామని హైదరాబాద్‌తో చెబుతారని అన్నారు. గన్నీ బ్యాగులు నాణ్యంగా లేకపోవడం వల్ల హమాలీలకు ఇబ్బందిగా ఉందని.. తూకంలో క్వింటాకి రెండు కిలోలు తరుగు తీస్తున్నారని మండిపడ్డారు. అటు అకాల వర్షాలు, ఇటు రైతుబంధు, మద్దతు ధర రాక ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని వెంటనే ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
………………………………