
తెలంగాణలో ఆరోగ్య శ్రీ బంద్!
* బకాయిలు చెల్లించాలని టీఏఎన్హెచ్ఏ డిమాండ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : నిన్నటి వరకు ఫీ రీయింబర్స్మెంట్ కోసం ప్రైవేటు కాలేజీలు బంద్ పాటిస్తే.. ఈరోజు ఆ బంద్ ఆస్పత్రులకు పాకింది. తెలంగాణ(Telangana)లో ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేక్ పడింది. నిన్న అర్ధరాత్రి నుంచి నెట్ వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలను నిలిపేశారు. నెలల తరబడి పెండింగ్ ఉన్న బకాయిల విడుదల కోరుతూ తెలంగాణ ఆరోగ్య శ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోషియేషన్ (టీఏఎన్హెచ్ఏ) ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 330 ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్య శ్రీ (Arogyasri) సేవలు నిలిచిపోయాయి. 12 నెలల నుంచి రూ.1400 కోట్ల బకాయిలు చెల్లించలేదని, 22 నెలలుగా ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ బకాయిలు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో హాస్పిటల్స్ నడిపించే పరిస్థితి లేదని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఇదిలాఉంటే.. సోమవారం ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.100 కోట్లు విడుదల చేసినట్లు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. అయినా నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవల బంద్ నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు.
ఏపీలోనూ…
మరోవైపు ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)లోనూ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. బకాయిలు చెల్లించకపోవడంతో ఓపీడీ సేవలను ఆపేశాయి. ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. వారంలోగా సమస్య పరిష్కరించాలంటూ వైద్య సేవ సీఈవోలకి లేఖ రాశారు ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద సేవలందించే ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ ఓపీ సేవలను నిలిపివేశాయి. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రెండు వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. వారంలోగా సమస్య పరిష్కరించకపోతే పూర్తిసేవలను నిలిపి వేయాల్సి వస్తుందని ఎన్టీఆర్ వైద్య సేవ CEOకి లేఖ రాసింది.
………………………………….