
ఆకేరు న్యూస్ డెస్క్ : లద్దాఖ్ ఉద్యమ కారుడు వాతావరణ హక్కుల కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ అరెస్టయ్యారు. లద్దాఖ్ కు రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. స్థానిక బీజేపీ కార్యాలయానికి ఆందోళన కారులు నిప్పు పెట్టారు ఘర్షణల్లో నలుగురు మరణించగా,100 మందికిపైగా గాయపడ్డారు. లద్దాఖ్‌లో హింసను రెచ్చగొట్టినట్టు సోనమ్ వాంగ్చుక్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిరసనలు జరిగిన రెండు రోజుల తర్వాత వాంగ్చుక్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
వాంగ్‌చుక్ సంస్థ లైసెన్స్ రద్దు
మరోవైపు సోనమ్ వాంగ్‌చుక్ ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాఖ్‌కు (SECMOL) గతంలో జారీ చేసిన ఎఫ్సీఆర్ఏ రిజిస్ట్రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వేతర సంస్థలు విదేశీ నిధులను స్వీకరించేందుకు అవకాశం కల్పించే చట్టాన్ని ఈ సంస్థ పదేపదే ఉల్లంఘించినట్లు తెలిపింది.
వాంగ్చుక్పై సీబీఐ దర్యాప్తు
వాంగ్చుక్పై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు ప్రారంభమైంది. ఆయన ఏర్పాటు చేసిన హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లద్దాక్ (హెచ్ఐఏఎల్)కు వస్తున్న నిధులపై దర్యాప్తు రెండు నెలల క్రితం ప్రారంభమైందని సీబీఐ అధికారులు చెప్పారు. ఆయన ఈ ఏడాది ఫిబ్రవరి 6న పాకిస్థాన్‌లో పర్యటించడంపై కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలులో చేర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం ఆయన ఇటీవల నిరాహార దీక్ష చేశారు.
ఎందుకీ అల్లర్లు..?
బీజేపీ ప్రభుత్వం 2019లో 370 ఆర్టికల్ ను రద్దు చేసిన తరువాత జమ్ము కాశ్మీర్ ను రాష్ట్ర హోదా రద్దు చేసి రాష్ట్రాన్ని మూడు భాగాలు చేసింది. ఈ నేపధ్యంలో లద్దాఖ్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో వివిధ తెగలకు నిలయమైన ఈ ప్రాంతంలో సాంప్రదాయకంగా ఉన్న వీరి హక్కులకు 370 ఆర్టికల్ రద్దుతో హామీ లేకుండా
పోయింది. ఏడు దశాబ్దాలుగా లేని అభద్రత వారిని వెంటాడుతోంది.పైగా స్థానికతకు ఏ మాత్రం పరాయీకరణ జరుగుతోందనే భయం వారిని వెంటాడుతోంది.కనీసం రాజ్యాంగంలో పొందుపరిచిన ఆరవ షెడ్యూల్ లోని అంశాలను అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. రక్షణలు ఉద్యోగాలు స్థానికులకు రిజర్వ్ చేస్తూ ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుచేయాలని ఇక్కడి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. లద్దాఖ్ ప్రాంతానికి రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఎవరీ సోనమ్ వాంగ్ చుక్
సోనమ్ వాంగ్ చుక్ విద్యావేత్త సామాజిక కార్యకర్త,వృత్తి రీత్యా ఇంజనీర్,పలు ఆవిష్కరణలు చేసి ప్రభుత్వంతో అవార్డులు గెలుచుకున్నారు.వాంగ్‌చుక్ 1966 లో లడఖ్‌లోని లేహ్ జిల్లాలోని ఆల్చి సమీపంలో జన్మించాడు . ఆ గ్రామంలో పాఠశాలలు లేనందున, 9 సంవత్సరాల వయస్సు వరకు అతన్ని పాఠశాలలో చేర్చలేదు. ఇంటి వద్దనే తల్లి వద్ద అతని ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగింది. ఆ తరువాత అతడిని శ్రీనగర్ లో ఉన్న పాఠశాలలో చేర్పించారు. ఆ తరువాత అక్కడి పరిస్థితులను తట్టుకోలేక 1977లో వాంగ్ యుక్ ఢిల్లీకి పారిపోయాడు.ఢిల్లీలోని విశేష్ కేంద్రీయ విద్యాలయంలో చేరాడు ఆ తరువాత వాంగ్‌చుక్ 1987లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీనగర్ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో B.Tech పూర్తి చేశాడు. ఆ తరువాత 2011లో ఫ్రాన్స్‌లోని గ్రెనోబుల్లోని క్రేటెర్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో రెండు సంవత్సరాలు చదివాడు. 1988లో, గ్రాడ్యుయేషన్ తర్వాత, వాంగ్‌చుక్ తన సోదరుడు మరియు ఐదుగురు సహచరులతో కలిసి స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడఖ్ (SECMOL)ను ప్రారంభించాడు. ఈ సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న విద్యా విధానంలో మార్పులు తేవడానికి కృషి చేశాడు ప్రభుత్వానికి పలు సూచనలు చేశాడు అతడు ఇచ్చిన సలహాలతోనే జమ్ము కాశ్మీర్ పాఠశాలల్లోఅనేక సంస్కరణలు చేశారు. 1993లో మ్యాగజైన్ లడగ్స్ మెలాంగ్ను స్థాపించి సంపాదకుడిగా కూడా పనిచేశారు. ఆ తరువాత ఆయనను ప్రభుత్వం విద్యా సలహాదారుగా నియమించింది. ఆయన లడఖ్ హిల్ కౌన్సిల్ ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ లడఖ్ 2025 యొక్క డ్రాఫ్టింగ్ కమిటీకి నియమితులయ్యారు మరియు 2004లో విద్య మరియు పర్యాటక రంగంపై విధానాన్ని రూపొందించే బాధ్యతను అప్పగించారు. 2005లో వాంగ్‌చుక్ భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలోని ప్రాథమిక విద్య కోసం జాతీయ పాలక మండలిలో సభ్యుడిగా నియమితులయ్యారు.
వాంగు చుక్ ఆవిష్కరణలు
జోనమ్ వాంగ్ చుక్ కొత్త ఆవిష్కరణలు కనిపెట్టాడు. ఆమీర్ ఖాన్ నటించిన త్రీ ఈడియట్స్ సినిమాకు వాంగ్ చుక్ ప్రేరణతోనే తీశారని చెప్తారు.2013 లో వాంగ్ చుక్ ఐస్ నిలువ ఉండే విధంగా ఆవిష్కరణలు చేశారు . స్తూపం ఆకారంలో ఐస్ నిలువ ఉండే విధంగా ఐస్ స్తూపం నమూనాను కనుగొని నిర్మించాడు. ఇది శీతాకాలంలో వృధాగా ప్రవహించే ప్రవాహ నీటిని భారీ మంచు శంకువులు లేదా స్థూపాల రూపంలో నిల్వ చేస్తుంది , తిరిగి వసంతకాలం చివరిలో నీటిని కరగడం ప్రారంభించినప్పుడు విడుదల చేస్తుంది, రైతులకు నీటి కొరత ఏర్పడే కాలంలో వారికి ఉపయోగపడే విధంగా ఈ మంచుస్తూపాన్ని కొనుగొన్నాడు. ఆ తరువాత 2015 నుండి పర్వత ప్రాంతాల్లో ఉండే జీవన విధానం వారి స్థితిగతులపై అధ్యయనం చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత అతి శీతలంగా ఉండే ప్రాంతాల్లో సౌరశక్తి ని ఎలా వాడుకోవాలో అనే దానిమీద పరిశోధనలు చేశాడు. అతిశీతలంగా ఉండే ప్రాంతాల్ల వెచ్చదనం ఇచ్చే భవనాల నిర్మాణాలపై కృషి చేశాడు. వాంగ్ చుక్ సైనికుల కోసం ప్రత్యేక గుడారాలను తయారు చేశారు. ఈ గుడారాల ప్రత్యేకత ఏంటంటే అతి శీతలంగా ఉండే ఎత్తైన ప్రాంతాల్లో పగటి పూట ఈ గుడారాలు సూర్య శక్తిని గ్రహించి రాత్రి వేళ వెచ్చదనాన్ని ఇస్తాయి. ప్రత్యేకంగా భారత సైనికుల కోసమే ఈ గుడారాలను ఆయన కనుగొన్నారు. ఒక్కొక్క గుడారంలో 10 మంది సైనికులు బస చేయవచ్చు
లడఖ్ కు రాజ్యాంగ హక్కులను కల్పించాలనే డిమాండ్
లడఖ్ ను కేంద్రప్రభుత్వం 2019లో కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడంతో లడఖ్ ప్రజల్లో అభద్రతా భావం పెరుగుతూ వస్తోంది. తమ అస్తిత్వానికి ముప్పు ఏర్పడిందనే భావన వచ్చింది. ఈ నేపధ్యంలో లడఖ్ కు కనీస రక్షణలు కల్పించాలనే ఆందోళనలు ఎక్కువయ్యాయు. లడఖ్ ప్రాంతాన్ని కార్పొరేట్ శక్తులు ఆక్కమిస్తాయనే భయం ఈ ప్రాంత ప్రజలకు పట్టుకుంది, లడఖ్ ప్రజలకు మద్దతులగా వాంగ్ చుక్ లడఖ్ కు రక్షణ కల్పించాలని , రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. 2024 సెప్టెంబర్ 30న, తమ డిమాండ్ల సాథన కోసం లడఖ్ నుండి ఢిల్లీకి కాలినడకన వెళుతుండగా , వాంగ్‌చుక్ మరియు అతని మద్దతుదారులను సింఘు సరిహద్దు వద్ద ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని 2024 అక్టోబర్ 2న విడుదల చేశారు.
…………………………………………………………..