
*దావత్ పేరుతో ఊరు చివరికి..
*మద్యం తాగించి.. చెవిలో గడ్డి మందు పోసి…
*కొడుకు ఫిర్యాదుతో నేరం వెలుగులోకి
ఆకేరు న్యూస్, కరీంనగర్ : కాలం మారుతోంది.. మనుషులు మారుతున్నారు… మనుషుల మనస్తత్తాలు మారుతున్నాయి.. దారుణాలు చోటు చేసుకుంటున్నాయి.. ఒకప్పుడు భర్తలు భార్యలను అవమానించడం, హింసించడం, చిత్రహింసలకు గురిచేయడం.. హత్య చేయడం.. వివాహేతర సంబంధాలు తదితర సంఘటనలు చోటు చేసుకోగా.. నేటి మారిన సమాజంలో సంఘటనలు తారుమారవుతున్నాయి.. అంతే తేడా… సంఘటనలు పునరావృతం… ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన సంఘటనే దీనికి నిదర్శనం.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ కిసాన్‌నగర్‌కు చెందిన ఐలవేణి సంపత్ (Ilaveni sampath) (45) జిల్లా గ్రంథాలయంలో స్వీపర్‌గా పనిచేసేవాడు. సంపత్‌కు భార్య రమాదేవి, 25 ఏళ్ల కొడుకు భరత్ ఉన్నారు. సంపత్ మద్యానికి బానిస కావడంతో నిత్యం ఇంట్లో గొడవలు జరిగి భార్యను కొట్టడం, వేధించడం చేసేవాడు. కాగా, రమ సర్వపిండి విక్రయిస్తుండగా, 8 నెలల కిందటి నుంచి సర్వపిండి కోసం వచ్చే 50 ఏళ్ల కర్రె రాజయ్యతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కాగా, కరీంనగర్ రైల్వే హమాలీగా రాజయ్య పనిచేసే క్రమంలో సంపత్తో పరిచయం ఏర్పడింది. ఎలాగైనా భర్త సంపత్‌ను అడ్డు తొలగించుకునేందుకు పథకాలను యూట్యూబ్‌లో వెతకగా, ఎవరి చెవిలోనైనా గడ్డి మందు పోస్తే చనిపోతారని చూసి , ఈ విషయం రాజయ్యకు తెలిపింది. కాగా, జూలై 29న సంపత్ ఎప్పటిలాగే భార్యతో గొడవపడి బయటికి వెళ్లిపోయాడు. అదే రోజు సంపత్‌ను రాజయ్య, తన స్నేహితుడు కీసరి శ్రీనివాస్‌తో కలిసి బొమ్మకల్ రైల్వే ట్రాక్ వద్దకు మద్యం పార్టీకి పిలిచాడు. మద్యం మత్తులోకి సంపత్ జారుకున్న అనంతరం రాజయ్య రమకు ఫోన్ చేసి హత్యకు అనుమతి తీసుకొని, రాజయ్య, శ్రీనివాస్ తమవెంట తెచ్చిన గడ్డిమందును సంపత్ చెవిలో పోశారు. గడ్డి మందు మెదడుకు వ్యాపించటంతో సంపత్ మరణించాడు. హత్య తర్వాత భార్య ఏమీ తెలియనట్లుగా నటించి, కొడుకు , ప్రియుడితో కలిసి సంపత్ ఆచూకీ కోసం వెతికారు. మరుసటి రోజు రాజయ్య, శ్రీనివాస్‌లతో కలిసి తన భర్త సంతోష్ కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆగస్టు 2 వ తేదీన మృతదేహం దొరికిందని తామే పోలీసులకు తెలిపారు. కొడుకు భరత్ తన తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా భార్య రమావేవి కాల్ డేటాను పరిశీలించి అదుపులోకి తీసుకొని విచారించారు. రమాదేవి తన ప్రియుడు రాజయ్య, అతని స్నేహితుడు శ్రీనివాస్‌తో కలిసి భర్తను చంపించినట్లు ఒప్పుకుంది. ఈ ఘటనలో పోలీసులు రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్‌లను అరెస్టు చేశారు.
……………………………………..