* తండ్రిపై కోపంతో నాలుగేళ్ల చిన్నారి తల పగులగొట్టిన ఆటో డ్రైవర్!
* పాల్ఘర్లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన
* ఆడుకుంటున్న పసివాడిని ఈడ్చుకొచ్చి.. ఇనుప రాడ్‌కు కొట్టి.. నేలకేసి బాదిన ఆటో డ్రైవర్!
ఆకేరు న్యూస్, డెస్క్: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునేలా ఒక అత్యంత అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కోపం మనిషిని ఎంతటి మృగంలా మారుస్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఒక చిన్న గొడవను మనసులో పెట్టుకున్న ఆటో డ్రైవర్, ఆ కక్షను తీర్చుకోవడానికి ఎంచుకున్న మార్గం వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. అమాయకంగా ఆడుకుంటున్న నాలుగేళ్ల పసివాడిపై సదరు డ్రైవర్ తన క్రూరత్వాన్ని చూపించాడు.
* అసలేం జరిగింది?
వసాయి ప్రాంతంలోని ఒక హౌసింగ్ సొసైటీలో నివసించే అతుల్ కొంధారే అనే వ్యక్తికి, సందీప్ పవార్ అనే ఆటో డ్రైవర్‌కు మధ్య సోమవారం సాయంత్రం ఒక చిన్న విషయంలో వాగ్వాదం జరిగింది. ఈ గొడవ ఆ క్షణానికి ముగిసినట్లు అనిపించినా, సందీప్ పవార్ మనసులో మాత్రం పగ రగిలిపోయింది. ఆ కోపాన్ని ఎలాగైనా తీర్చుకోవాలనుకున్న అతను, రాత్రి 8 గంటల సమయంలో అతుల్ కొంధారే కుమారుడైన విఘ్నేష్ (4) లక్ష్యంగా చేసుకున్నాడు.
* రాక్షసంగా దాడి చేసిన దృశ్యాలు..
సొసైటీలో పార్క్ చేసి ఉన్న ఒక ఆటోలో విఘ్నేష్ మరికొందరు పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సందీప్ పవార్, ఆ చిన్నారిని కాళ్లూ చేతులు పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చాడు. ఏమాత్రం కనికరం లేకుండా ఆ పసివాడిని గాలిలోకి ఎత్తి కిందపడేశాడు. అంతటితో ఆగకుండా, భయంతో వణికిపోతున్న ఆ బాబును బిల్డింగ్ లోపలికి తీసుకువెళ్లి అక్కడ ఉన్న ఒక ఇనుప రాడ్‌కు తల తగిలేలా బలంగా బాదాడు. ఆ తర్వాత మళ్ళీ చిన్నారిని నేలకేసి కొట్టి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఈ భయంకర దృశ్యాలన్నీ అక్కడి సిసిటివి కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
* మృత్యువుతో పోరాడుతున్న విఘ్నేష్..
ఈ దాడిలో చిన్నారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు విఘ్నేష్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మీరా రోడ్డులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పసివాడు ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నాడు. వైద్యులు బాబు ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
* పోలీసుల చర్యలు..
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు సందీప్ పవార్‌ను అరెస్టు చేశారు. అతనిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109(1) (హత్యాయత్నం) తో పాటు జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. కోర్టు నిందితుడికి మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. కళ్లముందే ఆడుకుంటున్న పిల్లాడిని అంత కిరాతకంగా బాదిన ఆ వ్యక్తికి కఠినమైన శిక్ష పడాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోపం కళ్లు గప్పితే మనిషి ఎంతటి రాక్షసుడిలా మారతాడో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
