
* పూర్తి స్థాయిలో బంద్ కు పిలుపునిచ్చిన యూనియన్లు
* కండీషన్లు ఒప్పుకుంటేనే చర్చలంటున్న నిర్మాతలు
* బెదిరింపులకు లొంగేది లేదంటున్న యూనియన్లు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : సినీ కార్మికుల ఆందోళన తారా స్థాయికి చేరింది. పూర్తి స్థాయిలో బంద్ లో పాల్గొనాలని సినీ కార్మికుల యూనియన్లు నిర్ణయం తీసుకున్నాయి. 30 శాతం వేతనాలు పెంచుతేనే షూటింగ్ లకు హాజరవుతామని యూనియన్లు తేల్చిచెప్పుతున్నాయి. ఈ నేపధ్యంలో రెండు రాష్ట్రాల సినిమాటొగ్రఫీ మంత్రుల దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు యూనియన్లు సిద్ధమవుతున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో ఏపీ సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ ను కలువనున్నారు. అలాగే తెలంగాణ సినిమాటొగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వద్దకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఆగస్టు 10 ఆదివారం నాడు ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది, పెద్ద సంఖ్యలో కార్మికులు అక్కడ గుమిగూడి తమ డిమాండ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. మొత్తం 24 యూనియన్లకు చెందిన కార్మికులు నిరసనలో పాల్గొన్నారు.
కార్మికుల వేతనాల వల్లే సినీ నిర్మాతకు నష్టమా?
తెలుగు సినిమా పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పటి నుంచి సినీ కార్మికులకు రెండేళ్లకు ఓసారి వేతనాల పెంపు అగ్రిమెంటు అమలవుతోంది. ప్రొడ్యూసర్ల కౌన్సిళ్లు, ఫిలిం ఫెడరేషన్ కార్మికుల మధ్య రాతపూర్వక ఒప్పందంతో ఇదంతా జరుగుతుంది. మొదట్లో ఏటా పెంపుదలలు జరగ్గా ఆ తర్వాత రెండేళ్లు, ప్రస్తుతం మూడేళ్లకు ఓసారి వేతనాల పెంపు జరుగుతోంది. 2022 తర్వాత ఎలాంటి అగ్రిమెంట్లు జరగలేదు. అందువల్ల మూడేళ్లకాలంగా ఏటా 10 శాతం చొప్పున పెరిగిన ధరలకు అనుగుణంగా 30 శాతం పెంపుదల చేయాల్సిందేనని కార్మికులు ఫెడరేషన్‌లోని వివిధ కార్మిక సంఘాల ద్వారా కోరుతున్నారు. ఈ మూడేళ్లలో ఇంటి అద్దెలు, జీవన వ్యయం, రవాణా ఖర్చులు, నిత్యావసర ధరలు అమాంతంగా పెరిగాయి. దానికి అనుగుణంగానే పెంచాలని కార్మికులు కోరుతున్నారు. ఒకేసారి 30 శాతం పెంచేది లేదంటూ నిర్మాతల మండలి చెబుతోంది. తాము ఒకేసారి అడగటం లేదని మూడేళ్ల క్రితం నుంచి పెంపుదల లేనికారణంగా ఇప్పుడు చేయాల్సిందేనని కార్మికులు పట్టుపడుతున్నారు. కార్మికులకు ఇచ్చే వేతనాల వల్లే తమకు నష్టం వాటిల్లుతున్నట్టుగా నిర్మాతలు మాట్లాడడం సమంజసంగా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
…………………………………………….