
* ఆ 400 ఎకరాలు హెచ్సీయూవా? ప్రభుత్వానివా?
* ఎవరి వాదనల్లో నిజమెంత
* హెచ్‌సీయూ వివాదానికి అంతం ఎప్పుడు?
* విద్యార్థి ఉద్యమంగా మారితే సర్కారుకు గండమేనా?
* ప్రతిపక్షాలకు కలిసొచ్చిన భూముల అంశం
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
తెలంగాణలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పాకింది. ఈ వ్యవహారంపై కేంద్రం జోక్యం చేసుకుని వెంటనే నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బీజేపీ తెలంగాణ ఎంపీలు లోక్‌సభలో ఈ అంశాన్ని ఇప్పటికే లేవనెత్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రను కలిసి వినతిపత్రం కూడా ఇచ్చారు. హస్తిన వేదికగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ రాష్ట్ర సర్కారు చర్యను ఎండగట్టారు. మరోవైపు బీఆర్ ఎస్ ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా, నేరుగా కాంగ్రెస్ సర్కారుపై అస్త్రాలు సంధిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనలకు తోడు.. రాజకీయంగా జరుగుతున్నఈ వరుస పరిణామాలపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణం స్పందించి, అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం కావాల్సి వచ్చింది. మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఆ భూములు ప్రభుత్వానివేనని ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కుట్ర చేస్తున్నారని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. హెచ్ సీయూ భూముల వ్యవహారంలో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలో అసలు ఆ భూములు నిజంగా ప్రభుత్వానివేనా, హెచ్సీయూవా.. ఎవరి వాదనలు ఏంటి? హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై ఆకేరు న్యూస్ వివరణాత్మక కథనం..
హెచ్‌సీయూ భూముల చరిత్ర ఇదీ..
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 1975లో గచ్చిబౌలి ప్రాంతంలో 2,324 ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 2003లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో 400 ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించాలని నిర్ణయించింది. అప్పట్లో సదరు కంపెనీకి ప్రభుత్వం 850 ఎకరాలు కేటాయించగా, అందులో 400 ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీ భూముల నుంచి తీసుకుని ఇచ్చింది. స్పోర్ట్స్ డెవలప్మెంట్కు దీన్ని వినియోగించాలనేది లక్ష్యం. 2004 జనవరి 13వ తేదీన ఐఎంజీ అకాడమీకి ఈ భూముల బదలాయింపు జరిగింది. అయితే, 2006లో ఆ భూముల కేటాయింపు రద్దయింది. స్పోర్ట్స్ అభివృద్ధికి సంబంధించి నిర్దేశిత సమయంలో పనులు ప్రారంభించకపోవడంతో 2006, నవంబరు 21న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూముల కేటాయింపు రద్దు చేసింది. దీనిపై అదే ఏడాది ఐఎంజీ అకాడమీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. భూముల కేటాయింపు రద్దుపై సుదీర్ఘ కాలం వాదనల తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధిస్తూ, 2024 మార్చిలో హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై ఐఎంజీ అకాడమీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా గతేడాది మే నెలలో పిటిషన్‌ను డిస్మిస్ చేసినట్లుగా ప్రభుత్వం ఒక ప్రకటనలో చెప్పింది.
ఆ భూమి మాదే.. కాదు మాదే
ఆ భూమి తమదేనని ప్రభుత్వం చెబుతోంది. ఈక్రమంలోనే ఐటీ, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ 400 ఎకరాలు కేటాయించాలని టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) గతేడాది జూన్ 19న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లుగా తెలుస్తోంది. అది అటవీ భూమి కాదని, ప్రభుత్వ భూమి అని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. అందులో వాస్తవం లేదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చెబుతోంది. ”ఇప్పటివరకు భూములకు హద్దులు నిర్ధరించలేదు. ఆ విషయాన్ని యూనివర్సిటీకి తెలియజేయలేదు. ప్రభుత్వానికి విజ్జప్తి చేసిన విధంగా పర్యావరణం, బయోడైవర్సిటీని కాపాడాలి.” అని యూనివర్సిటీ మార్చి 31న విడుదల చేసిన ప్రకటన విడుదల చేసింది. అయితే మరో వాదన కూడా ఉంది. ”2003లో 400 ఎకరాలు ప్రభుత్వం తీసుకుని, అందుకు ప్రతిగా గోపన్‌పల్లి వైపు 397 ఎకరాలు స్వాధీనపరిచినట్లు వర్సిటీ పెద్దలే చెబుతున్నారు. కానీ ఇచ్చిన భూమిలో కూడా కొంతమేర తిరిగి టీఐఎఫ్ఆర్ వంటి సంస్థలకు ప్రభుత్వం కేటాయించిందని అంటున్నారు. అలాగే, అప్పట్లో ఐఎంజీ అకాడమీ, రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌సీయూ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిందని, ఒప్పందం ప్రకారం పనులు చేయకపోతే తిరిగి వర్సిటీ ఆధీనంలోకే భూములు వస్తాయనేది వర్సిటీ వర్గాల వాదన.
ప్రస్తుతం ప్రభుత్వం నిర్ణయం ఏంటంటే..
అంతర్జాతీయ స్థాయిలో ఐటీ కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు వీలుగా ఆ 400 ఎకరాలను వేలం వేయాలనేది ప్రభుత్వం భావన. టీజీఐఐసీ ద్వారా వేలం వేసి భూములు విక్రయిస్తున్నామని రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. దీనిలో భాగంగానే అక్కడ పనులు కూడా మొదలుపెట్టారు. చాలా ప్రాంతాన్ని చదును చేశారు. దీంతో విద్యార్థులు ఉద్యమం తీవ్రతరం చేశారు. వర్సటీలోను, నగరంలోను కొద్ది రోజులుగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. వట ఫౌండేషన్ ఇప్పటికే హెచ్‌సీయూ భూముల కోసం హైకోర్టును ఆశ్రయించగా, పెరుగుతున్న పౌర సమాజం మద్దతుతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో నగరంలో హెచ్‌సీయూ పరిరక్షణ కోసం ఆందోళనలు, నిరసనలతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తంగా మారాయి. ఇక సోషల్ మీడియాలోనూ సేవ్హెచ్సీయూ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ కొనసాగుతున్నది. అయిప్పటికీ వేలం విషయంలో వెనక్కి తగ్గేది లేదు అన్నట్లుగా ప్రభుత్వ విధానం కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి కోసమే ఇదంతా అన్నట్లు ప్రచారం చేస్తోంది.
విపక్షాలు ఏం అంటున్నాయి అంటే..
గత ప్రభుత్వం బీఆర్ ఎస్ అనుసరించిన విధానాలనే కాంగ్రెస్ కూడా ఫాలో అవుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. హెచ్‌సీయూలో అంశంలో ముందు నుంచీ బీజేపీ తన వాదనలు వినిపిస్తోంది. లోక్‌సభ ద్వారా కేంద్రం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లింది. మరోవైపు బీఆర్ ఎస్
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విద్యార్థులకు తాము అండగా ఉంటామని ప్రకటిస్తున్నారు. అంతేకాదు.. పొరపాటున కూడా కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని.. మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. ఆ 400 ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్క్‌ని ఏర్పాటు చేసి హైదరాబాద్ ప్రజలు, హెచ్‌సీయూ విద్యార్థులకు కానుకగా ఇస్తామని ప్రకటించారు. మొత్తంగా హెచ్‌సీయూ అంశం ప్రతిపక్షాలకు ఊపిరి పోసినట్లుగా మారింది. విద్యార్థి ఉద్యమంగా మారితే సర్కారుకు గండం తప్పేలా కనిపించడం లేదు.
ఇప్పటికే రూ.10 వేల కోట్ల అప్పు?
భూముల వేలానికి వ్యతిరేకంగా హెచ్ సీయూ అట్టుడుకుతోంది. ఈ భూమిలో ఒక్క అంగుళం కూడా వదులుకోమని విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆందోళనలు చేస్తున్నారు. ఒక్క ఇంచు కూడా హెచ్ సీయూ భూములను తీసుకోవడం లేదని ప్రభుత్వం చెబుతోంది. కంచ గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 25లో 400 ఎకరాలను తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ద్వారా అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఆ భూములపై సర్కారు రూ. 10 వేల కోట్లు అప్పు తీసుకుందని బీఆర్ ఎస్ ఆరోపిస్తోంది. అయితే, ఆ భూములు వర్సిటీ భవనాలను ఆనుకునే ఈ భూములు ఉండటంతో అవి వర్సిటీకి చెందిన భూములంటూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.
సంచలనంగా మారిన సుప్రీంకోర్టు తీర్పు
కంచ గచ్చిబౌలి భూముల్లో జరుగుతున్న ప్రభుత్వ చర్యలు అన్నీ నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా కోర్టు చేర్చింది. అత్యవసరంగా కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ఇది చాలా తీవ్రమైన అంశం అని జస్టిస్ గవాయ్ ధర్మాసనం పేర్కొంది. అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికను సుప్రీంకోర్టు పరిశీలించింది. వార్తా కథనాలను జస్టిస్ గవాయ్ ముందు అమికస్ క్యూరీ మెన్షన్ చేసింది. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక ఫొటోలు చూస్తే పరిస్థితి అర్థమవుతుంరేదన్నారు. వందల యంత్రాలు మోహరించాల్సిన అవసరమేంటని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టివేత చిన్న విషయం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. చెట్ల కొట్టివేతకు అనుమతి తీసుకున్నారా..? అని కోర్టు ప్రశ్నించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఒక్క చెట్టు కూడా నరికివేయొద్దని కోర్టు ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయాలని సీఎస్‌ను కోర్టు ఆదేశించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ భూముల అంశంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తుందా.. అసలు ఆ చాన్స్ ఉందా? అనేది ఆసక్తిగా మారింది.
…………………………………………………..