
* ఫార్మా బాధితులు తెల్లవారుజామునే ఇంటి వద్దకు..
* ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు
* ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్
* మంత్రులు భట్టి, సీతక్క,కోమటిరెడ్డిలపైనా ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సోమవారం తెల్లవారుజామునే ఫార్మా బాధిత రైతులు, ప్రజలు ఆ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించారు. ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 300 మందికిపైగా అక్కడకు వచ్చి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ( malreddy Ranga Reddy )ఇంటి ముందు ఈ ఆందోళన జరిగింది. యాచారం మండలంలోని మేటిపల్లి నానక్ నగర్ తాటిపర్తి కురుమిద్ద గ్రామాలకు చెందిన ఫార్మా బాధిత రైతులు, , మహిళలు, యువకులు తెల్లవారుజామునే కృయిజర్లు, ట్రాక్టర్లు కట్టుకొని తిరుమలహిల్స్ (thirumala hills)లోని ఎమ్మెల్యే రంగారెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇంటిముందు బైఠాయించారు. మాకు న్యాయం చేయండి.. అంటూ ప్లకార్డులను ప్రదర్శించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే రంగారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ రైతులు భీష్మించి కూర్చున్నారు. ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి మాట్లాడుతూ… కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని (pharma city)రద్దు చేస్తామని ఫార్మా బాధిత రైతులకు భూములను తిరిగి ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్న నేటికీ హామీ నెరవేర్చలేదని అన్నారు. ఫార్మాసిటీ పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఫార్మా కు ఇవ్వని 2500 ఎకరాల భూమిని తిరిగి రైతుల పేరిట ఆన్ లైన్లో నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నిషేధిత జాబితా నుండి ఇట్టి భూములను వెంటనే తొలగించాలని కోరారు. రైతులకు రైతు భరోసా, రైతు భీమా, పంట రుణం, రుణమాఫీ, రైతులు భూమిని అమ్ముకునేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ అయ్యేలా వసతి కల్పించాలని ఆమె కోరారు. అధికారంలోకి రాకముందు రైతులతో కలిసి పాదయాత్ర చేసిన మంత్రులు సీతక్క(seethakka), భట్టి విక్రమార్క, (bhatti vikramarka)కోమటిరెడ్డి వెంకటరెడ్డి (komati reddy venkat reddy)ఎమ్మెల్సీలు కోదండరాం,(kodandaram)తీన్మార్ మల్లన్న(theenmar mallanna), రంగారెడ్డి రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి( kodanda reddy)లు నేడు వారికి పదవులు రాగానే ఫార్మా రైతులను పూర్తిగా విస్మరించాలని ఆమె మండిపడ్డారు. ఇకపై రైతులతో పాదయాత్ర చేసి రైతులను విస్మరించిన ప్రతి నాయకుడిని ఇంటిని ముట్టడించి నిలదీస్తామని హెచ్చరించారు.
……………………………………………………