
* వికటించిన డబ్బాపాలు
* పోయిన కవలల ప్రాణాలు
* కవలల దినోత్సవాన కలకలం
* కన్నతల్లికి కడుపు కోత
* గొల్లపల్లిలో విషాదఛాయలు
ఆకేరున్యూస్, భూపాలపల్లి: అభం శుభం తెలియని నాలుగు నెలల కవలలు మృత్యువాత పడ్డారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ చిన్నారులు శాశ్వతంగా కండ్లు మూయడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. అంతర్జాతీయ కవలల దినోత్సవం రోజే ఈ ఘటన పలువురిని కలచివేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గొల్లపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డబ్బాపాలు వికటించి ఇద్దరు నాలుగు నెలల కవల పిల్లలు మృత్యువాతపడ్డారు. గ్రామానికి చెందిన మర్రి లాస్యశ్రీ, అశోక్ దంపతులకు రెండవ సంతానంలో కవల పిల్లలుగా పాప, బాబు జన్మించారు. కవల పిల్లలకు తల్లిపాలు సరిపోక పోవడంతో డబ్బా పాలు పట్టిస్తు పిల్లల అలనా పాలన చూసుకుంటున్నారు. అయితే ఉదయం నుండి పిల్లలకు రెండుసార్లు డబ్బా పాలు పట్టించి పడుకోబెట్టగా మధ్యాహ్నం వరకు పిల్లల్లో ఉలుకు పలుకు లేకపోవడంతో తల్లి ఒక్కసారిగా తల్లడిల్లిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంతలోపే పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. న్యూట్రిసియా కంపెనీకి చెందిన డిక్సోలాక్ అనే డబ్బా పాలు పట్టించడం వల్లనే పిల్లలు మృతి చెందినట్లు తల్లిదండ్రులు వాపోయారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలోనే కాకుండా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
………………………………….