
* రంగనాయక మంటపంలో వేదాశీర్వచనం
ఆకేరున్యూస్, తిరుమల: టిటిడి ఈవోగా అనిల్‌కుమార్ సింఘాల్ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమల చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ఈవోగా ప్రమాణం చేశారు. రంగనాయకుల మండపంలో ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలిచ్చారు. అనిల్ సింఘాల్‌కు అదనపు ఈవో వెంకయ్య చౌదరి శేషవస్త్రం కప్పి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ.. రెండోసారి ఈవోగా అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రెండోసారి అవకాశం రావడం పూర్వజన్మ సుకృతం అని పేర్కొన్నారు. కాలినడక మార్గంలో వస్తున్నప్పుడు భక్తులు కొన్ని సమస్యలు దృష్టికి తెచ్చారని తెలిపారు. వాటిని పరిష్కరించి మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడాలని సిఎం చంద్రబాబు నాయుడు తనకు సూచించారన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు. ఆయన సూచనల మేరకు తన సేవలను విస్తృతం చేస్తానని, సామన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. ఇదిలావుంటే బదిలీ అయిన ఈవో శ్యామలరావుకు ఆలయ అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ.. పూర్వ జన్మ సుకృతం ఉంటే తప్ప తితిదే ఈవోగా పనిచేసే భాగ్యం కలగదన్నారు. తనకు ఈవోగా పనిచేసే అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. 14 నెలల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు చెప్పారు. రాబోయే 25 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు, అభివృద్ధి చేపట్టినట్లు వివరించారు. బోర్డు సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు.
……………………………………………..