*ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసు విచారణలో సంచలన నిజాలు!
*షీలా నుంచి కాదు.. హైదరాబాద్‌లోనే డ్రగ్స్ కొనుగోలు?
*సిట్ విచారణలో రోహిత్ రెడ్డి కీలక వాంగ్మూలం!
*ఫామ్‌హౌస్‌లో ఆ రాత్రి ఏం జరిగింది?
*కాల్పుల నుంచి డ్రగ్స్ సప్లై వరకు.. నోరు విప్పిన నిందితులు!
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక ఘట్టం ముగిసింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మల మూడు రోజుల ‘సిట్’ కస్టడీ గురువారంతో ముగిసింది. శంషాబాద్ పోలీస్ స్టేషన్లో నిందితులను సుదీర్ఘంగా విచారించిన అధికారులు, అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి నేరుగా కోర్టుకు తరలించారు.
*అసలేం జరిగింది?
గత వారం మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌పై పోలీసులు మెరుపు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అక్కడ జరిగిన పార్టీలో డ్రగ్స్ వినియోగించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దాడుల సమయంలో ఢిల్లీకి చెందిన నిందితుడు నమిత్ శర్మ గాలిలోకి కాల్పులు జరపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం, లోతైన విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను రంగంలోకి దించింది.
*విచారణలో వెల్లడైన కీలక అంశాలు:
గత మూడు రోజులుగా కస్టడీలో ఉన్న నిందితులను సిట్ అధికారులు విడివిడిగా, అలాగే కలిపి విచారించారు. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ఫామ్‌హౌస్ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? వీటిని సరఫరా చేసింది ఎవరు? అనే కోణంలో సిట్ కీలక సమాచారాన్ని సేకరించింది. పార్టీలో అసలు కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది? ఆ సమయంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు? అన్న అంశాలపై నిందితుల నుంచి కీలక స్టేట్మెంట్లను రికార్డు చేశారు. నిందితుల మొబైల్ ఫోన్లలోని డేటాను విశ్లేషించిన అధికారులు, గతంలో కూడా ఇలాంటి పార్టీలు జరిగినట్లు అనుమానిస్తున్నారు.
*కొత్త అరెస్టులకు రంగం సిద్ధం?
విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా డ్రగ్స్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న వ్యక్తుల కోసం సిట్ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. ఈ కేసులో త్వరలోనే మరిన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
