* సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా..
* పరీక్షకేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
ఆకేరు న్యూస్ , హనుమకొండ : ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మిక తనిఖీ చేశారు. బుధవారం హనుమకొండ లోని పింగిళి కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆమే సందర్శించి విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును స్వయంగా పర్యవేక్షించారు. పరీక్షకు కేటాయించిన విద్యార్థుల సంఖ్య, ప్రస్తుత హాజరు వివరాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) ఎ. గోపాల్, చీఫ్ సూపరింటెండెంట్ సునీత, మరియు డిపార్ట్మెంటల్ అధికారి రమేష్‌లను అడిగి తెలుసుకున్నారు.ప్రశ్నపత్రాల పంపిణీ ప్రక్రియను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ముఖ్యంగా సీసీ కెమెరాల నిఘా నీడలో ప్రశ్నపత్రాలను తెరిచే గదిని తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం ప్రక్రియ జరుగుతుందా లేదా అని నిర్ధారించుకున్నారు.పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన తాగునీరు, వెలుతురు, ఫ్యాన్లు వంటి వసతుల ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, వడ్డేపల్లిలోని ఎస్సార్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
—————————————————-

