
* హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
ఆకేరున్యూస్, హన్మకొండ: ఎలాంటి అవాంతరాలు లేకుండా స్త్రీ, పురుష సమానత్వంతోనే సమాజం పురోగతిని సాధిస్తుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. మంగళవారం హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో కళాశాల మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో యాక్సిలరేట్ యాక్షన్ అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్యఅతిథిగా హాజరై అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ గతంలో బాలబాలికల నిష్పత్తితో పాటు విద్యలోనూ వ్యత్యాసం ఉండేదని, కానీ అది నేడు తగ్గిపోతూ వస్తుందన్నారు. సమాజంలో వివిధ అవకాశాలను పొందేందుకు మహిళలకు సమాన హక్కులు రాజ్యాంగంలో కల్పించబడ్డాయన్నారు. మహిళలకు ఉన్నత విద్యను అభ్యసించే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాలికలు విద్యా, ఉద్యోగ, ఇతర రంగాలలో సమాన అవకాశాలను సాధించాలన్నారు. ఈ సందర్భంగా ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలను జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిథిగా హాజరైన కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం మాట్లాడుతూ భిన్న రంగాలలో మహిళలు రాణిస్తూ తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, కాకతీయ యూనివర్సిటీ ఈసీ మెంబర్ డాక్టర్ కె.అనితా రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, తదితరులను మహిళా అధ్యాపకులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఉమెన్స్ సెల్ డైరెక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీలత, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శ్రీధర్ కుమార్ లోథ్, తిరునహరి శేషు, మహిళా అధ్యాపకులు, విద్యార్థినివిద్యార్థులు పాల్గొన్నారు.
………………………………………