
* డిఈఈ నాగేశ్వరరావు
ఆకేరు న్యూస్ , ములుగు : విద్యుత్తు వినియోగదారుల సౌకర్యార్థం తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (TGNPDCL) ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తెచ్చి “WhatsApp Chat Bot” ద్వారా కూడా వినియోగదారులు తమ విద్యుత్ సంబంధిత ఫిర్యాదులు, సేవలు పొందే సదుపాయాన్ని కల్పించినట్లు డివిజనల్ ఇంజనీర్ నాగేశ్వరరావు తెలిపారు.
వినియోగదారు తమ మొబైల్ వాట్సాప్‌లో 7901628348 నంబర్‌కు “హాయ్” అని పంపగానే, “Welcome to TGNPDCL Call Center” అని సందేశం అందుతుంది. వెంటనే రిజిస్టర్ కంప్లైంట్, ట్రాక్ కంప్లైంట్, చాట్ విత్ ఏజెంట్ వంటి ఆప్షన్లు వస్తాయని తెలిపారు.
వినియోగదారుడు Unique Service Number ఎంటర్ చేస్తే, వెంటనే ఆ విద్యుత్ సర్వీస్ వివరాలు ప్రదర్శించబడతాయి. వివరాలను ఓకే చేసిన తరువాత, కంప్లైంట్‌కు సంబంధించిన విభాగాల మెనూ కనిపిస్తుంది. వినియోగదారుడు తాను ఎదుర్కొంటున్న సమస్యను ఎంచుకుని ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు లేదా నేరుగా ఏజెంట్‌తో చాట్ చేయవచ్చు. కంప్లైంట్ నమోదు అయిన వెంటనే ప్రత్యేక కంప్లైంట్ ఐడి సృష్టించబడుతుంది. ఆ వివరాలు వినియోగదారునికి SMS రూపంలో అందుతాయని తెలిపారు..
ఫిర్యాదు సంబంధిత అధికారికి పంపబడుతుంది. వినియోగదారు ఎప్పుడైనా కంప్లైంట్ ఐడి ద్వారా తన సమస్య పురోగతిని ట్రాక్ చేసుకోవచ్చు. సమస్య పరిష్కారం అయిన తరువాత వినియోగదారునికి IVRS కాల్ వస్తుంది. సమస్యపై ఫీడ్‌బ్యాక్ ఇవ్వమని అడుగుతారు. వినియోగదారు సంతృప్తి చెందనట్లయితే, అదే కంప్లైంట్‌ను మళ్లీ రీఓపెన్ చేసుకునే అవకాశం ఉందన్నారు.
TGNPDCL అధికారిక వెబ్సైట్ www.tgnpdcl.com లో కూడా “WhatsApp Icon” అందుబాటులో ఉంటుందని వినియోగదారులు ఆ ఐకాన్‌పై క్లిక్ చేసి నేరుగా చాట్ చేయవచ్చు. అదనంగా, టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని ఆయన తెలిపారు.
సాంకేతికతను సద్వినియోగం చేసుకుని వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం, సమయాన్ని ఆదా చేయడం, పారదర్శకతను కాపాడటం ఈ చాట్ బాట్ ప్రత్యేకత అని అన్నారు. ఈ కొత్త సదుపాయం ద్వారా వినియోగదారులకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందే అవకాశం ఉందని డివిజనల్ ఇంజనీర్ నాగేశ్వరరావు పేర్కొన్నారు.
……………………………………..