
* వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఆకేరున్యూస్, వరంగల్: నూతన భూ చట్టం భూభారతితో భూసమస్యలు పరిష్కారమవుతాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ వడ్డేపల్లి సమీపంలోని వీ ఆర్ బాంక్వెట్ హాల్ లో హనుమకొండ మండల స్థాయి భూభారతి చట్టం, రైతుల చుట్టం అవగాహన సదస్సులో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రైతుల సమస్యలను తెలుసుకునేందుకు, భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారం గురించి తెలియజేసేందుకే భూ భారతి చట్టం అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వడ్డేపల్లికి చెందిన రైతుల సమస్యలను పరిష్కరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కరించుకునే అవకాశం లభిస్తుందన్నారు. రైతులు భూ యజమానులు ఏవైనా సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ధరణిలో లేదని, కానీ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంలో సమస్యలు, అభ్యంతరాలు తెలియజేసే అవకాశం కల్పించిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా భూభారతి చట్టంలోని అంశాలను ముద్రించిన గోడప్రతులను ఆవిష్కరించారు. రైతులు జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను శాలువాతో సత్కరించారు. రైతులు, భూయజమానులు అడిగిన ప్రశ్నలకు భూభారతి చట్టం ద్వారా వాటికి ఉన్న పరిష్కారాలను తెలియజేస్తూ హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్ సమాధానాలిచ్చారు. భూభారతి చట్టంలోని మార్గదర్శకాలను ఆర్డీవో చదివి వినిపించారు. చట్టంలోని వివరాలను తెలియజేసే కరపత్రాలను రైతులు, భూ యజమానులకు అందజేశారు.
………………………………….