* రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: విద్యార్థుల ఆహార భద్రతపై అధికారులు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. చలికాలం ప్రతిరోజు విద్యార్థులకు నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనాన్ని అందించాలని, భోజన నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో ఫుడ్ కమిషన్ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, రంగినేని శారద, ఎం భారతి, బి జ్యోతి నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలంలోని గుడిగండ్ల, జక్లేర్, మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలను సందర్శించారు. ఆయా పాఠశాలలలో విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. అలాగే వంటగది, వంటకు నియోగించే బియ్యంతో పాటు నిత్యవసర సరుకులైన ఉప్పు, పప్పు, నూనె, అల్లం, పసుపు ను పరిశీలించారు. నిత్యావసర సరుకులు నాణ్యమైనవి ఉండాలని వంట ఏజెన్సీ నిర్వహకులకు సూచించారు. గుడిగండ్ల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని రుచిచూసిన కమిషన్ బృందం కూరగాయలు( కర్రీ) ఇంకాస్త మెరుగ్గా, రుచికరంగా ఉండాలని సూచించారు. కోడి గుడ్లను ఉడికించిన అరగంట లోపు విద్యార్థులకు ఇవ్వాలన్నారు. కూరగాయలు, పప్పులో పోపు గింజలు ఉండేలా చూడాలన్నారు.
వంటకు వినియోగించే నీటిని పరిశీలించి, నీళ్ల ట్యాంకును క్రమం తప్పకుండా శుభ్రం చేయించాలన్నారు. పాఠశాలలోని తరగతి గదులకు వెళ్లి మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉంటుందా లేదా అని విద్యార్థులను వారు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని ఉపాధ్యాయులు తిని రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని హెచ్ఎం ను ఆదేశించారు. పాఠశాలలో ఫిర్యాదుల పెట్టే ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం కమిషన్ బృందం జక్లేర్ జెడ్పి ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. ఆ పాఠశాలలో వంటగదిని చూసి వంటకు ఉపయోగిస్తున్న ఫామ్ ఆయిల్ కు బదులు బ్రాండ్ కలిగిన నూనె ను వినియోగించాలని, అల్లం సరిగ్గా లేదని వెంటనే మార్చాలని చెప్పారు. ఎన్ని సంవత్సరాల నుంచి పాఠశాలలో వంట చేస్తున్నారని ఏజెన్సీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి కూరగాయలు, పప్పులో పోపు గింజలు లేకపోవడంపై కమిషన్ బృందం అసహనం వ్యక్తం చేశారు. తమకు మధ్యాహ్న భోజనం లో గిట్టుబాటు కావడం లేదని కమిషన్ బృందం సభ్యులకు వంట ఏజెన్సీ నిర్వాహకులు చెప్పడంతో గిట్టు బాటు కాకపోతే ఏజెన్సీ నుంచి తప్పుకోవాలని సభ్యులు సున్నితంగా హెచ్చరించారు. గిట్టు బాటు కాకుండా 20 సంవత్సరాల నుంచి ఎలా వంట చేస్తున్నారని నిర్వాహకులను నిలదీశారు. ముందుగా కర్రీ వడ్డించి, తర్వాత పప్పు వేయాలని ఏజెన్సీ నిర్వాకులకు సూచించారు. పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థులను కూర్చోబెట్టి పోపు గింజల వల్ల కలిగే లాభాలను విద్యార్థులకు వివరించాలని సూచించారు. మెస్ కమిటీ పిల్లల కంటే ముందు ఉపాధ్యాయులే భోజనాన్ని కృషి చూడాలని, అంతా బాగుందని ధ్రువీకరించిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని బృందం సభ్యులు ఆదేశించారు.
నారాయణపేటలో ఇటీవల అన్నంలో పురుగులు వస్తే ఆ అన్నం ను పారబోసి మళ్లీ తాజాగా వంట చేసి వడ్డించిన విషయాన్ని ఈ సందర్భంగా కమిషన్ బృందం గుర్తు చేశారు. పాఠశాలలో తప్పనిసరిగా కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే, భోజనం బాగా లేకపోతే కాగితంలో రాసి ఫిర్యాదుల పెట్టెలో వేస్తారని, నేరుగా ఉపాధ్యాయులకు తమ సమస్యలను తెలిపేందుకు విద్యార్థులు భయ పడే ఆస్కారం ఉందన్నారు. కంప్లీట్ బాక్స్ లో వచ్చిన ఫిర్యాదులను పాఠశాల హెచ్ఎం చూడవద్దని, ఎంఈఓ, ఆ పై స్థాయి అధికారులు చూస్తారని వారు తెలిపారు. అనంతరం బృందం సభ్యులు మక్తల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ వంటకు తెచ్చిన కూరగాయలను పరిశీలించారు. సగం కోసి పెట్టిన కాయగూరలను వంటకు వినియోగించ రాదని చెప్పారు. పాఠశాల స్టోర్ రూమ్ లోని బియ్యం, నిత్యవసర సరుకుల నాణ్యతను చూశారు. వంట సరుకులను ఎన్ని రోజులకు ఓసారి తీసుకొస్తారని ప్రిన్సిపల్ ను అడిగి తెలుసుకున్నారు. స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు.
విద్యార్థినులతో ఇంట్రాక్ట్ అయి వారితో కలిసి మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసిన కమిషన్ సభ్యులు వంటల్లో ఉప్పును సరైన మోతాదులో వేయాలని సూచించారు. టమాటా చారు రుచిగా లేదని, ఇకపై కర్రీలు, పప్పు, సాంబారు రుచికరంగా వండి వడ్డించాలని సూచించారు. పిల్లల ఆహార భద్రత లో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. భోజనం చేస్తున్న విద్యార్థినుల హిమో గ్లోబిన్ ( హెచ్. బి ) ఎంత ఉందని ఒకరిద్దరిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులలో హెచ్. బీ స్థాయిని పెంచేలా సరైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని ప్రిన్సిపల్ కు సూచించారు. గురుకుల పాఠశాలలో శుక్రవారం మెనూ ప్రకారం గుడ్డు వడ్డించాలని కానీ గుడ్లు ఎందుకు ఇవ్వడంలేదని ప్రిన్సిపాల్ ను ప్రశ్నించారు. గుడ్ల ను సరఫరా చేసే ఏజెన్సీ సభ్యులు వారం రోజులుగా తమకు గిట్టు బాటు కావడం లేదని గుడ్లను సరఫరా చేయడం లేదని ప్రిన్సిపల్ తెలపడంతో స్పందించిన కమిషన్ సభ్యులు వెంటనే గురుకుల పాఠశాలల ఉన్నతాధికారులకు చెప్పి సమస్యను వెంటనే పరిష్కరించి పాఠశాలకు గుడ్ల సరఫరాను ప్రారంభింపజేయాలని ఆర్డీవో రామ్ చందర్ ను ఆదేశించారు. పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ కు చెప్పారు. తర్వాత ఎల్లమ్మ కుంట లోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ గర్భిణీలకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీలకు ఆహారాన్ని ఇంటికి పంపించవద్దని, తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రంలో నే గర్భిణీలు భోజనం చేసి వెళ్లేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంగన్వాడి టీచర్ కు సూచించారు.
కేంద్రంలో ఒకరిద్దరు పిల్లల బరువును పరిశీలించారు. గత నెలలో వచ్చిన బరువు కంటే ప్రస్తుతం వచ్చిన బరువు తక్కువ ఉండడం పై కార్యకర్తను నిలదీశారు. పిల్లల బరువు పెరిగేలా పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. కేంద్రానికి పాలు గుడ్లు సరఫరా చేసే ఏజెన్సీ గురించి తెలుసుకున్నారు. సిడిపివోలు క్రమం తప్పకుండా అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసి కేంద్రాల పనితీరును, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చివరగా కమిషన్ బృందం మక్తల్ గంజి రోడ్ లోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్ ను, దుకాణంలో ఉన్న బియ్యాన్ని పరిశీలించారు. అంతోదయ కార్డులు ఎన్ని ఉన్నాయని డీలర్ ను అడిగి తెలుసుకున్నారు. రేషన్ దుకాణం బయట స్టాక్ వివరాలతో పాటు రెవిన్యూ అధికారుల ఫోన్ నంబర్లను రాసి బోర్డు పెట్టాలన్నారు. రేషన్ బియ్యం పక్క దారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజల నుంచి రేషన్ బియ్యాన్ని కొనే దళారుల పై కూడా దృష్టి పెట్టి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
……………………………………..