Special Lok Adalat Warangal
* నవంబర్ 21న స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహణ
* అక్టోబర్ 12 నుంచి నవంబర్ 20 వరకు ముందస్తు రాజీ సమావేశాలు
* వరంగల్‌లో రెండు, నర్సంపేటలో ఒక బెంచ్ ఏర్పాటు
* వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కందుకూరి పూజ వెల్లడి
ఆకేరు న్యూస్, వరంగల్ : చెక్ బౌన్స్ కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు నవంబర్ 21న ప్రత్యేక లోక్ అదాలత్ ( Special Lok Adalat ) నిర్వహిస్తున్నారు. ఇరు పక్షాలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జీ కందుకూరి పూజ ( Kandukuri Pooja ) తెలిపారు.
ఈ మేరకు హనుమకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. . జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టం (Negotiable Instruments Act) పరిధిలోని చెక్ బౌన్స్ కేసుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రత్యేక లోక్ అదాలత్‌కు ముందుగా అక్టోబర్ 12 నుంచి నవంబర్ 20 వరకు ముందస్తు రాజీ సమావేశాలు (Pre-Lok Adalat) నిర్వహించనున్నారు. ఇందుకోసం వరంగల్‌లో రెండు, నర్సంపేటలో ఒకటి చొప్పున మొత్తం మూడు బెంచ్‌లను ఏర్పాటు చేశారు. రాజీకి ఆసక్తి ఉన్న కక్షిదారులు తమ న్యాయవాదులతో కలిసి ఆయా కోర్టులకు వచ్చి కేసుల పరిష్కారానికి చర్చలు జరపవచ్చని పూజ సూచించించారు.
* కేసును బట్టి ఆర్థిక సంస్థల రాయితీలు
ఆర్థిక సంస్థలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసుల్లో, కేసు పరిస్థితులను బట్టి చెల్లించాల్సిన మొత్తంలో రాయితీలు ఇచ్చేందుకు ఆయా సంస్థలు ముందుకు వచ్చినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ( Legal services Authority ) తెలిపింది.
శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ చెక్ మొత్తంపై 30 శాతం వరకు, చోళమండలం సంస్థ 50 శాతం వరకు తగ్గింపునకు అవకాశం ఉన్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు తెలియజేశారని వివరించారు.
ఈ రాయితీలు ప్రతి కేసులోనూ ఒకేలా ఉండవని, సంబంధిత సంస్థతో జరిగే రాజీ చర్చలు, అంగీకారాన్ని బట్టి నిర్ణయమవుతాయని చెప్పారు. విచారణలో కాలయాపనను నివారించడం, వ్యయాన్ని తగ్గించుకోవడం, బకాయిలను త్వరగా వసూలు చేసుకోవడం వంటి కారణాలతో కొన్ని ఆర్థిక సంస్థలు రాజీ పరిష్కారానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిపింది.
* పరస్పర అంగీకారంతో పరిష్కారం
చెక్ బౌన్స్ కేసుల్లో చట్టపరమైన అనుమాన ప్రమేయాలు (Presumptions) వర్తిస్తాయని సంస్థ వివరించింది. చట్టబద్ధంగా చెల్లించాల్సిన రుణం లేదా బాధ్యత కోసం చెక్ ఇచ్చినట్లు భావించే ప్రమేయాన్ని ఖండించేందుకు, చెక్ జారీ చేసిన వ్యక్తి తన వాదనకు తగిన ఆధారాలను చూపాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
లోక్ అదాలత్ ద్వారా ఇరుపక్షాలు పరస్పర అంగీకారంతో వివాదాలను పరిష్కరించుకోవచ్చన్నారు. సుదీర్ఘ న్యాయ ప్రక్రియ, ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు సామరస్యపూర్వక పరిష్కారం పొందేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కందుకూరి పూజ కక్షిదారులను కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

