* ఎస్పీటీయూ జర్నలిజం విద్యార్థుల క్షేత్రస్థాయి పరిశీలన
* అధ్యాపకులకు నివేదికలు సమర్పణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విస్తుపోయే విషయాలను గుర్తించినట్లు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ (ఎస్పీటీయూ) విద్యార్థులు వెల్లడించారు. ఆయా గ్రామాల్లో చేసిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఓట్ల కోసం మితిమీరిన ధన ప్రవాహం, కిడ్నాప్‌లు, బెదిరింపులతో పాటు తమకు నచ్చిన అభ్యర్థి గెలుపు కోసం పార్టీలకు అతీతంగా కలిసిమెలిసి ప్రచారం లాంటి ఘటనలెన్నో చూసినట్లు నివేదిక సమర్పణ సందర్భంగా విద్యార్థులు వివరించారు. రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా యూనివర్సిటీ ప్రథమ , ద్వితీయ సంవత్సర విద్యార్థులు వివిధ గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో అభ్యర్థుల ఎన్నిక, బలపలిచిన పార్టీల మద్దతు, అభ్యర్థుల బలాలు, బలహీనతలు. అభ్యర్థుల గెలుపోటములకు సహకరించిన వివిధ కారణాలు, ఏకగ్రీవమైన విధానం, ప్రచార తీరు, సరళి, ప్రచార సాధనాలు, ప్రలోభాలు హామీలు, ఓటర్ల తీరుతెన్నులతోపాటు వివిధ అంశాలను విద్యార్థులు పరిశీలించారు. గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన విద్యార్థులు యూనివర్సిటీ, బాచుపల్లి లో జరిగిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో తాము నమోదు చేసిన అంశాలను అధ్యాపకుల ముందు ప్రదర్శించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు అవకాశం కల్పించిన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య డాక్టర్ వెల్దండ నిత్యానందరావు, రిజిష్ట్రార్ ఆచార్య డాక్టర్ కోట్ల హనుమంతరావు, హెచ్ ఓ డి ఆచార్య డాక్టర్ పద్మప్రియలకు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అధ్యాపకులకు నివేదికలను అందజేశారు. ప్రథమ సంవత్సరం విద్యార్థినీ విద్యార్థులను డాక్టర్ షేక్ హసీనా, ద్వితీయ సంవత్సరం విద్యార్థినీ విద్యార్థులను డాక్టర్ షేక్ షమీర్, ప్రాక్టికల్స్ ఇంచార్జ్ గోపాల్ పర్యవేక్షించారు. వివిధ గ్రామాల్లో క్షేత్ర ప్రదర్శనకు వెళ్ళిన విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా తమ నివేదికలను అధ్యాపకులు తోటి విద్యార్థినీ, విద్యార్థులు మధ్య ప్రదర్శించటం గొప్ప అనుభూతులు పంచిందని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలన అనేక రకాల అనుభూతులను అనుభవాలను, మిగిల్చడంతో పాటు రిపోర్టును తయారు చేయడంలో క్లాస్ రూమ్ లో నేర్చుకున్న, కమ్యూనికేషన్ రిపోర్టింగ్ పాఠాలు విషయసేకరణకు తోడ్పడటంతో పాటు ఎడిటింగ్ పాఠాలు రిపోర్టు తయారు చేయడానికి ఉపయోగపడ్డాయని విద్యార్థినీ, విద్యార్థులు తెలియజేశారు. జర్నలిజం క్లాస్ రూమ్ పాఠాలతో పాటు ఇటువంటి క్షేత్రస్థాయి పరిశీలనలు జర్నలిజం విద్యార్థినీ, విద్యార్థులకు నైపుణ్యాలను మెరుగుపరచడంతో పాటు నైపుణ్యం కలిగిన రిపోర్టర్లను,ఎడిటర్లను వెలుగులోకి తెస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

…………………………………………….

