* దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న కల్తీ
* సంచలనం రేపిన చంద్రబాబు వ్యాఖ్యలు
* అసలు గుజరాత్ రిపోర్ట్ లో ఏముంది?
* ఆ శాంపిల్ జగన్ రెడ్డి పాలనలోదేనా?
* రాజకీయంగానే కాదు.. సామాజికంగానూ తీవ్ర దుమారం
* కోట్లాది మంది భక్తుల మదిలో కలకలం
ఆకేరు న్యూస్ డెస్క్ :
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఆ పేరులోనే ఎంతో పవిత్రత దాగుంది. ఆ దేవస్థానం సన్నిధిలో కాసేపైనా సేద తీరాలని కోట్లాది మంది ఆరాటపడతారు. కలియుగ దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనభాగ్యం కోసం పరితపిస్తారు. స్వామి ప్రసాదం స్వీకరించాలని, పది మందికీ పంచాలని భావిస్తారు. శ్రీవారి ప్రసాదమైన లడ్డూ దొరికితే చాలు.. కళ్లకు అద్దుకుని మరీ తింటారు. తిరుపతి లడ్డూకు అంతటి విశిష్ఠత ఉంది. ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంతకుమించిన పవిత్రత ఉంది. ఇప్పుడు ఆ లడ్డూ ప్రసాదంపై తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్రం నుంచి కేంద్రం వరకు.. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం తయారీలో అపచారం జరిగిందని, స్వచ్ఛమైన నెయ్యికి బదులు జంతు కొవ్వు, చేప నూనె తదితర వ్యర్థాలు కలిపిన కల్తీ నెయ్యి వినియోగించారని జరుగుతున్న ప్రచారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. కోట్లాది మంది శ్రీవారి భక్తుల మదిలో కలకలం రేపుతోంది. హైందవ సమాజ ఆగ్రహానికి కారణమవుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య మాటల మంట పుట్టిస్తోంది. ఈనేపథ్యంలో శ్రీవారి లడ్డూ తయారీలో నిజంగా అపచారం జరిగిందా? రాజకీయాల కారణంగా తెరపైకి వచ్చిందా అనే చర్చ జరుగుతోంది.
చంద్రబాబు ప్రకటన తర్వాత..?
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యల తర్వాత వివాదం మొదలైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో నాణ్యత లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై గత శుక్రవారం సచివాలయంలో జరిగిన సమావేశంలో చంద్రబాబు తెరపైకి తెచ్చారు. గతంలో లడ్డూ తయారీలో జరిగిన తప్పిదాలపై శుక్రవారం సాయంత్రంలోగా పూర్తి నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను సీఎం ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్‌లతో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ ప్రకటన అనంతరం అపచారం.. అపచారం.. అంటూ టీడీపీ నేతలతో పాటు ఆధ్మాత్మిక, ధార్మిక, హైందవ సంఘాల నాయకులు ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపైనా, నాడు టీడీపీ చైర్మన్లుగా వ్యవహరించిన వారిపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
ఉలిక్కిపడ్డ వైసీపీ
చంద్రబాబు ప్రకటనతో వైసీపీ ఉలిక్కిపడింది. వెంటనే నాటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. తిరుపతి లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గమని, ఏ రాజకీయ నాయకుడూ ప్రవర్తించని విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీవారి ప్రసాదం తయారీలో ఏ తప్పూ జరగలేదని, నేను, నా కుటుంబ సభ్యులు ప్రమాణం చేస్తామని, చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రమాణం చేసేందుకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారని, తిరుమల లడ్డూలో అపచారం జరగలేదని తెలిపారు. కావాలనే చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు.. ల్యాబ్‌కు పంపిన లడ్డూ ప్రసాదం శాంపిల్స్ జగన్ రెడ్డి పరిపాలనలోది కాదని, చంద్రబాబు హయాంలో తీసిన లడ్డూ శాంపిల్ అని తెలిపారు. దానికి చంద్రబాబు, శ్యామలరావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక అబద్దాన్ని పదిసార్లు చెబితే ప్రజలు నమ్ముతారని బాబు భావిస్తున్నారని, వరదలు, వంద రోజుల్లో ఏపీకి జరిగిన నష్టాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ అంశం తెరపైకి తెచ్చారని విమర్శించారు.
ఆ నెయ్యి ఎప్పటిది? శాంపిల్స్ ల్యాబ్ కు పంపింది ఎప్పుడు..
లడ్డూ అంశంలో జరిగిన అపవిత్రతపై వైసీపీ భిన్న వాదనలు వినిపిస్తోంది. రవీంద్రనాథ్ రెడ్డే కాదు.. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా కొత్త వాదన తెరపైకి తెచ్చారు. లడ్డూ తయారీ చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఓ కట్టుకథ అని, అంత దుర్మార్గమైన పని ఎవరైనా చేస్తారా అని ప్రశ్నించారు. దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగే దారుణమైన మనస్తత్వం చంద్రబాబుది అని విరుచుకుపడ్డారు. ఇదిలాఉండగా, చంద్రబాబు చేసిన వ్యాఖ్యల కంటే ముందే టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియాకు ఓ రిపోర్టు విడుదల చేశారు. లడ్డూ ప్రసాదానికి ఉపయోగిస్తున్న నెయ్యిలో అపచారం జరిగిందని దాని బట్టే వెలుగులోకి వచ్చింది. అయితే, శాంపిల్స్ సేకరించిన తేదీ, పంపిన తేదీ, రిపోర్టు వచ్చిన తేదీలపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జగన్ కూడా మాట్లాడుతూ.. జూలై 12న నెయ్యి శాంపిల్స్ తీసుకున్నారని, అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (NDDB) కాఫ్ లిమిటెడ్ సంస్థకు అదే నెల 17న శాంపిల్స్ పంపారని, 23న ఎన్డీడీబీ రిపోర్ట్ అందించిందని వివరించారు. అప్పుడే రిపోర్టు వస్తే చంద్రబాబు ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 45 సార్లు అయ్యప్ప మాల వేసిన వైవీ సుబ్బారెడ్డికి దైవభక్తి ఎక్కువ అని, అలాంటి వారిపై బురదజల్లడం నీతిమాలిన చర్యగా జగన్ అభివర్ణించారు. కాగా, తేదీలతో సహా జగన్ వివరాలను వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. దీనిపై వైసీపీ హైకోర్టులో పిటిషన్ వేయడం, తాజాగా కేంద్రానికి, సీజేఐకు లేఖ రాస్తామని జగన్ పేర్కొనడం ఆసక్తిగా మారింది. వైసీపీ వేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం వచ్చే బుధవారం విచారణ చేస్తామని స్పష్టం చేసింది.
ఈవో ఒకలా.. కార్మిక సంఘాలు మరోలా..
తిరుపతి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటించడంపై టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి విమర్శించారు. టీటీడీలో పారదర్శకమైన విధానాలు అనుసరిస్తారని, ఏ ప్రసాదం తయారీకైనా దానికి వినియోగించే ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి టీటీడీ పరిధిలో ల్యాబ్ ఉందని, తనిఖీలు చేసిన తర్వాతే వాటిని వినియోగిస్తారని గుర్తుచేశారు. టీటీడీ నుంచి రోజుకొక బృందం ప్రతిరోజూ సర్టిఫై చేసిన తర్వాతనే ప్రసాదాలకు వినియోగించే ఆహార పదార్థాలను స్వీకరిస్తారని తెలిపారు. అయితే, టీటీడీ ఈవో శ్యామలరావు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీకి సొంత టెస్టింగ్ ల్యాబ్ లేదన్నారు. రూ.75 లక్షల ఖర్చయ్యే ల్యాబ్‌ను ఎందుకు పెట్టలేదో తెలియదని వ్యాఖ్యానించారు. టెస్టింగ్ ల్యాబ్ లేకపోవటమే సరఫరాదారులకు అవకాశంగా మారిందని చెప్పుకొచ్చారు. జంతు కొవ్వు వాడుతున్నారని ఫిర్యాదులు ఉన్నాయని… నెయ్యి నాణ్యత బాగా లేదు అని చాలా మంది భక్తులు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ఒక కేజీ ఆవు నెయ్యిరూ. 320 నుంచి రూ.411కే మధ్య ఉన్న రేటుకే ఎలా వస్తుందని తమకు అనుమానం వచ్చి, నెయ్యిని టెస్టింగ్ చేయించామని వెల్లడించారు. నెయ్యి నాణ్యత నిర్ధరణ కోసం ఎన్డీడీబీ ల్యాబ్‌కు శాంపిల్స్ పంపామని చెప్పారు. నెయ్యి నాణ్యత లేదని… కల్తీ జరిగినట్టు నివేదికలు వచ్చాయన్నారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామని తెలిపారు.
రమణదీక్షితుల ఆవేదన.. ఏమన్నారంటే..
శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై చాలా మంది స్పందిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులుగా గతంలో పనిచేసిన రమణదీక్షితులు సైతం చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఇది చాలా విచారకర అంశమన్నారు. ఈ ఐదేళ్లు నిరాటంకంగా మహాపాపం జరిగిందని, లడ్డూ ప్రసాదం నాణ్యత సరిగా లేదని, ఎన్నో ఆరోపణు వచ్చాయని, తాను ఎన్నో సార్లు టీటీడీకి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఒక శాస్త్రవేత్తగా నెయ్యి పరీక్షల ఫలితాలను చూశానని, జంతు కొవ్వు పదార్థాలు ఉన్నట్లు చూసి తీవ్ర ఆవేదన చెందానని వెల్లడించారు. శ్రీవారి దేవాలయంలో ఇలా జరగడం అశేషమైన భక్తులతో పాటు అర్చకుడిగా, భక్తుడిగా తనకు ఎంతో మనోవేదన కల్గించిందని అన్నారు.
భక్తుల మనోభావాలు దెబ్బతీశారన్న పవన్..
జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి లడ్డూ వివాదంపై తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం తెలిసి కలత చెందానన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. సనాత ధర్మానికి ముప్పు వస్తే అంతా కలిసి పోరాడాలన్నారు. జాతీయస్థాయిలో సనాతన ధర్మ స్థాపన కమిటీ వేయాలన్నారు.
కేంద్రం ఎంట్రీ..
గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరింది. లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. వారి వద్ద ఉన్న సమాచారాన్ని పంపించాల్సిందిగా కోరినట్లు వివరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ అంశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
ఇప్పుడేం జరగనుంది?
తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం ఇప్పుడు దేశవ్యాప్తమైంది. టీడీపీ, వైసీపీయే కాదు.. బీజేపీ ఇతర పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు కూడా స్పందిస్తున్నారు. హైకోర్టులోనే కాదు.. సుప్రీంకోర్టులో కూడా లెటర్ పిటిషన్ దాఖలైంది. భారత ప్రధాన న్యాయమూర్తికి జర్నలిస్టు సురేష్ చౌహాన్కే న్యాయవాది ద్వారా లేఖ రాశారు. మత విశ్వాసాలను వమ్ము చేశారని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం నియమించిన అధికారుల కారణంగానే ఇలాంటి పరిస్థితి నెలకొందని అందులో పేర్కొన్నారు. ఆలయాల పవిత్రత, మత విశ్వాసాలు, సంప్రదాయాలపై అవగాహన కలిగిన వారి చేతికే ఆలయాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని పిటిషన్ లో కోరారు. మరోవైపు సీజేఐ కు లేఖ రాస్తానని జగన్ కూడా ప్రకటించారు. ఈక్రమంలో ఈ వివాదం ఎటువంటి ములుపు తిరుగుతుంది అనేది ఉత్కంఠగా మారింది. అసలు లడ్డూ ప్రసాదానికి ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు ఎలా కలిసింది? ఆ పాపం ఎవరిది? ఎవరి హయాంలో జరిగింది అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు, సుప్రీంకోర్టు కూడా దీనిపై దృష్టి పెట్టనున్న నేపథ్యంలో మున్ముందు ఏం జరగనుందని ఆసక్తిగా మారింది.
భక్తలు సంకోచించాల్సిన అవసరం లేదు..
కోట్లాది మంది భక్తుల మదిలో కలకలం రేపిన ప్రసాదం కల్తీపై.. ఇకపై సంకోచం అవసరం లేదని సీఎం చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. అన్నింటినీ సరిదిద్ది ప్రజలకు నాణ్యమైన లడ్డూ ప్రసాదం తయారుచేసేలా చర్యలు చేపట్టామన్నారు. ఆ మేరకు పదార్థాల్లో మార్పులు, చేర్పులు చేశామని వివరించారు. అందువల్ల శ్రీవారి భక్తులు ప్రస్తుత లడ్డూ ప్రసాదంపై ఎటువంటి సంకోచం అవసరం లేదు.