* రైతులను అరిగోస పెడుతున్న మార్క్ ఫెడ్ అధికారులు
* ఫంగస్, కటింగ్ పేరుతో మక్కల కొనుగోలులో ‘గోల్ మాల్’
* ఫంగస్, కటింగ్ అభ్యంతరాలు
* అధికారులను నిలదీసిన రైతులు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
మక్కల కొనుగోలు కోసం మార్క్ఫెడ్ అధికారులు రైతులను అరిగోస పెడుతున్నారు. రైతులు తెచ్చిన మక్కల్లో ఫంగస్ ఉందని, కటింగులు ఉన్నాయని అభ్యంతరాలు చెబుతున్నారు. గత 15 రోజులుగా వివిధ గ్రామాల నుంచి రైతులు తెచ్చిన మక్కలను అధికారులు కొనకపోగా దళారీలు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో స్థానిక వ్యవసాయ మార్కెట్లో మక్కలు కొనుగోలులో ‘గోల్ మాల్ ‘ జరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులను నిలదీసిన సంఘటన గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్లో జరిగింది. ఆరు కాలం కష్టపడి పండించిన మక్కలను అమ్ముకునేందుకు వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ ఏర్పాటు చేసిన కేంద్రానికి తీసుకువస్తే మక్కలకు ఫంగస్ వచ్చిందని, కటింగ్ లు ఉన్నాయని వివిధ కారణాలు చెప్పి మార్క్ఫైడ్ అధికారులు కొనుగోలు తిరస్కరించడంతో విధి లేని పరిస్థితిలో రైతులు క్వింటాకు 200 నుండి 400 వరకు నష్టంతో దళారీలకు అమ్ముకునే పరిస్థితి మార్క్ ఫెడ్ అధికారులు కల్పిస్తున్నారు.
* ” అధికారిని నిలదీసిన రైతులు”
వారం, పది రోజుల క్రిందట మక్కలను వ్యవసాయ మార్కెట్కు తీసుకువస్తే మార్క్ ఫెడ్ అధికారి తేమను పరిశీలించకపోగా, మీ మక్కల్లో ఫంగస్, కటింగ్ ఉందని కొనుగోలుకు నిరాకరించడంతో కొత్త పెళ్లికి చెందిన కొండ తిరుపతి రెడ్డి, తమ్మడపల్లి (జి) కి చెందిన వైట్ల యాదగిరి, కోణాయిచలం కు చెందిన రాయి ప్రతాపరెడ్డి, తిడుగుకు చెందిన పింగళి యాకయ్య, ఏబీ తండాకు చెందిన లకావత్ రవి, యాకయ్య నాతోపాటు పలువురు రైతులు అధికారితో వాగ్వివాదానికి దిగారు. గ్రామాల నుండి మార్కెట్కు తరలించేందుకు నాలుగు నుండి ఐదు వేల ఖర్చు వచ్చిందని, ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే క్వింటాలుకు 400 రూపాయల నష్టం వస్తుందని మొత్తంగా కలుపుకొని రైతుకు 30 నుండి 50 వేల వరకు నష్టం వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్కు తెచ్చిన మక్కలను దళారులకు నష్టంతో అమ్మ లేమని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కాళ్ళ వేళ్లపడిన అధికారి ససేమిరా అనడంతో రైతులు మార్క్ పేడ్ అధికారితో వాగ్విగా దానికి దిగారు.

* ” కొనుగోలు ‘గోల్ మాల్’
తేమ ఉంది, ఫంగస్ ఉంది, కట్టింగులు ఉన్నాయని మార్క్ఫెడ్ అధికారులు రైతు తెచ్చిన మక్కల్ని తిరస్కరిస్తే మార్కెట్లో ఉన్న దళారులు రూ.2400 లకు బదులు రూ.1800 నుండి 2 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతు క్వింటాకు 2 వందల నుండి 4 వందల వరకు నష్టపోతున్నారు. ఈ గోల్ మాల్ కొనుగోలు దళారులు, మార్క్ ఫెడ్ అధికారులు కుమ్మక్కయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు.
* ” ఎమ్మెల్యే ప్రారంభించిన మొక్కలకే దిక్కులేదు”
ధాన్యం కొనుగోలు తరహాలోనే మక్కలను కొనుగోలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీలో ప్రస్తావించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వ్యవసాయ మార్కెట్ లో మార్క్ఫెడ్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించడం పట్ల నియోజకవర్గ రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో ఘనంగా మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. 15 రోజుల క్రిందట స్వయంగా ఎమ్మెల్యే తూకం వేసిన మక్కలనే మార్క్ ఫెడ్ అధికారులు నేటికీ కొనుగోలు చేయలేదంటే అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి, సంబంధిత అధికారులు స్పందించి మార్కెట్ కు తెచ్చిన మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
