* ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులకు వేగం..
* విద్యుత్ అంతరాయాల తగ్గింపునకు చర్యలు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలో టీజీఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిపార్ట్మెంటల్ ఎస్పీఎం (SPM) షెడ్‌ను సంస్థ డైరెక్టర్లు సోమవారం ప్రారంభించారు. డైరెక్టర్ (ఆపరేషన్స్) టి. మధుసూదన్, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) వి. మోహన్ రావు ఈ షెడ్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన ఎస్పీఎం షెడ్ అందుబాటులోకి రావడంతో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులను వేగంగా పూర్తి చేసేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. మరమ్మతులు పూర్తయిన ట్రాన్స్ఫార్మర్లను అవసరమైన ప్రాంతాలకు త్వరితగతిన తరలించి, క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో వెంటనే ఏర్పాటు చేసేందుకు ఈ సదుపాయం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
విద్యుత్ అంతరాయాల తగ్గింపునకు దోహదం
ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, పునఃస్థాపన ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించవచ్చని డైరెక్టర్లు వివరించారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడంతో పాటు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఈ షెడ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఈ (ఆపరేషన్స్–2) సురేందర్, జనగామ ఎస్ఈ సంపత్ రెడ్డి, ఎంఆర్టీ అండ్ కన్స్ట్రక్షన్ డీఈ, ఘన్పూర్ ఆపరేషన్ డీఈ, జనగామ టెక్నికల్ డీఈ, ఎస్పీఎం, ఆపరేషన్స్ విభాగాలకు చెందిన ఏడీఈలు, ఏఈలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

