* ఆంధ్రప్రదేశ్ వింత పోకడ
* నిన్న వైయస్ జగన్ పై దాడి
* నేడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై రాళ్ళదాడి
* రేపు మరెవరో..?
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) రాజకీయ ప్రచారంలో రాతి యుగం కొనసాగుతోంది. ఇపుడు రాష్ట్ర రాజకీయాలను రాళ్ళు కొత్త మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాడులు కొత్తవి కాకపోయినప్పటికీ ఇలాంటి రాళ్ళ ( Stones ) దాడులు మాత్రం రాజకీయాల్లో సరికొత్తవే. అవమానించడమే లక్ష్యమైతే చెప్పులు విసరడం లాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా గతంలో చాలా సంధర్భాల్లో జరిగాయి. చెప్పుల వల్ల అవమానం జరుగుతుంది.. ప్రాణాలకు మాత్రం ప్రమాదం ఉండదు. విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో మేమంతా సిద్దం యాత్రలో పాల్గొన్న సీఎం వైయస్ జగన్ ( YS jagan ) పైకి ఆగంతకుడు శనివారం రాయితో దాడి చేశారు. అదీ రాయా..? ఎయిర్ గన్ తో దాడిచేశారా ..? అన్న అంశాలు మాత్రం ఇంకా వెలుగు చూడలేదు. ఇదిలా ఉండగానే ఆదివారం గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల ప్రచారంలో ఉండగానే గుర్తు తెలియని వ్యక్తి రాయితో దాడి చేశారు. ఆయనకు తగలకుండా పవన్ కళ్యాణ్ ( Pawan kalyan ) సమీపంలో పడింది. దీంతో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. దాడి చేసిన వ్యక్తిని గుర్తించి జన సేన కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మరవక ముందే విశాఖ పట్నం గాజువాక ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ( Chandra babu Nayudu ) ప్రసంగిస్తుండగానే ఆకతాయిలు రాళ్ళు విసిరారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రాళ్ళు విసిరిన వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు.
* ప్రచారంలో రాళ్ళు
రాళ్ళ దాడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేగం పుంజుకుంటున్నాయి. రాజకీయ నేతలు సంయమనం పాటించిక పోతే , పోలీసులు అప్రమత్తంగా లేక పోతే తప్పనిసరిగా రాళ్ళ దాడి కొనసాగింపు వికృత పోకడలకు దారీ తీసే అవకాశాలు లేక పోలేదు. మాటలు తూలడం .. వ్యక్తిగతంగా కాకుండా కుటుంబాలను టార్గెట్ చేయడం గత కొంత కాలంగా ఆంధ్ర రాజకీయాల్లో కొనసాగుతోంది. అధికారమే పరమావధి అయినప్పడు ఏం చేయడానికైనా వెనుకాడే పరిస్థితి ఉండదు. వ్యక్తగత దూషణల స్థాయి నుంచి భౌతిక దాడుల స్థాయికి ఆంధ్ర రాజకీయాలు దిగజారి పోవడం విచారకర పరిణామం. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్సార్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు లక్షలాది మందిని పోగేయడానికి ప్రాధాన్యతనిస్తున్నారు. దీని వల్ల ఆకతాయిల చేష్టలకు అడ్డుకట్ట వేయడం పోలీసులకు అంత సులభమైన విషయమేమి కాదు. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న వేళ పోలీసులకు ఇలాంటి దాడులు కత్తి మీద సాము లాంటివే..
—————–