* అదానీ వివాదాలపై టీపీసీసీ నిరసన
* రాజ్‌భవన్ వరకు ప్రదర్శన.. పాల్గొన్న కాంగ్రెస్ ప్రముఖులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అదానీ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మణిపూర్ హింసాత్మక పరిస్థితులు, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ(GOWTHAM ADHANI) వివాదాలపై కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపు మేరకు టీపీసీసీ(TPCC) నిరసన ప్రదర్శన చేపట్టింది. చలో రాజ్ భవన్ పేరుతో చేపట్టిన ఈ ర్యాలీకి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM REVANTHREDDY) నేతృత్వాన్ని వహించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇందులో పాల్గొన్నారు. ఈ ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డుకోవడంతో రేవంత్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు. తన నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు, దేశ సమస్యలకు సంబంధించి ముఖ్యమంత్రి హోదాలోనే కాదు.. ఏ హోదాలో ఉన్నా రోడ్డు ఎక్కి పోరాడతానని తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(NARENDRA MODI), గౌతమ్ అదానీ ఆర్థిక అవకతవకలకు పాల్పడి ప్రపంచం ముందు దేశ పరువు తీశారని ఆరోపించారు. అమెరికాకు సంబంధించిన సంస్థలకు అదానీ లంచాలు ఇచ్చారంటూ ఆ దేశ విచారణ సంస్థలు సైతం నివేదికలు ఇచ్చాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వమే ధర్నాకు కూర్చోవడం కొందరికి నచ్చకపోవచ్చని, కొందరికి కడుపులో నొప్పి ఉండొచ్చని విమర్శించారు. బీజేపీ(BJP)తో బీఆర్ ఎస్(BRS) చీకటి ఒప్పందంలో భాగంగానే ఆదానీపై వారు నోరు మెదపట్లేదని ఆరోపించారు. జేపీసీపై డిమాండ్ చేస్తే శాసన సభలో తీర్మానం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జేపీసీ (JPC)వేయకపోతే అవసరమైతే రాష్ట్రపతి భవన్ వద్ద కూడా ధర్నా చేయడానికి తామందరం సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి అన్నారు.
……………………………………………..