* జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు అజారుద్దీన్‌కు చాన్స్
* రెండేళ్ల తర్వాత నగరానికి ప్రత్యేక గుర్తింపు
* తాజా పరిణామాల నేపథ్యంలో ఎన్నికలుంటాయా?
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సంగ్రామం విజయం కోసం సమాయత్తమవుతున్న కాంగ్రెస్ సర్కారు.. రానున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం కూడా వ్యూహరచన మొదలుపెట్టింది. రాజధానిపై పట్టుకోసం ప్రయత్నిస్తూ ఒక్కో మెట్టు పైకెక్కుతున్న హస్తం పార్టీ.. జీహెచ్ఎంసీని కూడా హస్తగతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే నగరానికి చెందిన మరొకరికి ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రస్తుతం ఇక్కడ, శివారులో కాంగ్రెస్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరు కంటోన్మెంట్లో శ్రీగణేశ్.. మరొకరు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నిన్నే ప్రమాణ స్వీకారం చేసిన నవీన్‌యాదవ్, శివారు నియోజకవర్గమైన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు.
సరిగ్గా ఉప ఎన్నికకు ముందు..
రెండేళ్ల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్‌లో ఒక్క స్థానం కూడా దక్కలేదు. జీహెచ్ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాలు ఉండగా ఒక్క స్థానం కూడా గెలవలేదు. దీంతో రాష్ట్ర క్యాబినెట్లో హైదరాబాద్ నుంచి ఎవరికీ స్థానం దక్కలేదు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే మరణంతో ఏడాది క్రితం వచ్చిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ గెలుపొందారు. గవర్నర్ కోటలో ఏడాది క్రితం అమీర్ అలీఖాన్‌ను హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ ప్రతిపాదించగా హైకోర్టు నామినేషన్‌ను రద్దు చేసింది. మరోసారి అమిర్‌అలీఖాన్ పేరు ఖరారు అవుతుందని భావించగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అనూహ్యంగా అజారుద్దీన్ పేరు తెరపైకి వచ్చింది. దాంతో పాటు క్యాబినెట్లో చోటును సైతం కల్పించింది. ఆరు నెలల్లో శాసనసభలో కానీ, మండలిలో కానీ సభ్యుడు కావాల్సి ఉండగా.. గవర్నర్ కోటలో అజారుద్దీన్ ఎంపిక చేశారు.
గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని..
వాస్తవానికి జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు వరకు హైదరాబాద్ మహా నగరానికి మంత్రి పదవి దక్కింది. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో ఇప్పటి వరకు చోటు లేదు. రిటైర్డ్ క్రికెటర్, సీనియర్ కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌ను ఇప్పుడు మంత్రి పదవి వరించింది. మంత్రి వర్గంలో మైనార్టీలకు స్థానం లేదని విపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు కాంగ్రెస్ చెక్ పెట్టింది. రెండు నెలల క్రితమే గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ఖరారు చేసిన కాంగ్రెస్, అమాత్య పదవి కట్టబెట్టింది. నవీన్‌యాదవ్ కూడా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని ఆయన గెలిచినప్పటి నుంచీ ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఆయనపై మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ.. అజారుద్దీన్-నవీన్ యాదవ్ ఒకటే నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు కావడం అడ్డంకి కానుంది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే వ్యూహంగా మరొకరికి మంత్రి ఇవ్వాలనే ఆలోచనలో అధిష్ఠానం ఉంది. మరోవైపు.. జీహెచ్ఎంసీ పరిధి పెరిగిన నేపథ్యంలో వాటి లెక్కలపై క్లారిటీ వచ్చే వరకు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే సందేహాలూ ఉన్నాయి.
…………………………………………………………..
