ఆకేరు న్యూస్, కరీంనగర్ : పదో తరగతి విద్యార్థిని శ్రీవర్షిత ఆత్మహత్య సంఘటనతో తోటి విద్యార్థులు కన్నీటి పర్యాంతమయ్యారు. గురుకులాల్లో విద్యార్థులకు భద్రత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహాల్లో సమస్యలతో సహావాసం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భీమదేవరపల్లి మండలం వంగరలోని పి.వి. రంగారావు బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతన్న విద్యార్థి శ్రీ వర్షిత ఆత్మహత్య రాష్ట్రంలో కలకలం రేపింది. విద్యార్థిది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్. చదువులో క్లాస్ టాపర్ ఉందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. వర్షిత ఆత్మహత్య వెనుక గురుకుల ప్రిన్సిపాల్, సిబ్బంది వేధింపులే ప్రధాన కారణమని విద్యార్థిని కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు. విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ప్రిన్సిపల్ వేధింపులే కారణం : కుటుంబ సభ్యులు
ప్రిన్సిపాల్ వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని శ్రీవర్షిత తండ్రి వనం తిరుపతి ఆరోపించారు. విద్యార్థులకు ఇచ్చే మెనూ విషయంలో జరుగుతున్న అవకతవకలపై శ్రీవర్షిత అధికారులకు ఫిర్యాదు చేసిందని తోటి విద్యార్థులు వెల్లడించారు. ఈ ఫిర్యాదు కారణంగానే ప్రిన్సిపాల్, సిబ్బంది ఆమెను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై విపరీతమైన మానసిక ఒత్తిడి పెడుతున్నారని, కనీసం బొట్టు పెట్టుకున్నందుకు కూడా మందలించిన సంఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని .. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
సిబ్బందిని తొలగించాలి : పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎంఎల్ ఏ
వంగర గురుకుల సిబ్బందిని వెంటనే విధుల్లోంచి తొలగించాలని హుజూరాబాద్ ఎంఎల్ ఏ పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలన్నారు. వేధింపులకు కారణమైన వారిపై ఆత్మహత్యకు ప్రేరేపించడం కింద కేసు నమోదు చేయాలన్నారు. వర్షిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేసే వరకూ పోరాటం చేస్తామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. సంఘటనపై పూర్తి విచారణ చేపట్టాలని హనుమకొండ కలెక్టర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించిన విషయం తెలిసింది.
……………………………………………..
