
* పాలకులు ప్రజా స్వామ్యవాదుల గొంతు నొక్కుతున్నారు
* పోలీసులు పాలకుల తొత్తులుగా వ్యవహరిస్తున్నారు
* ఢిల్లీ పోలీసులు అమిత్ షా నియంత్రణలో పనిచేస్తున్నారు
* ఢిల్లీ జెఎన్ యూ విద్యార్థి సంఘాల సంయుక్త ప్రకటన
ఆకేరున్యూస్ డెస్క్ : ఢిల్లీలో రాజ్యహింస జరుగుతోందని ప్రజాస్వామ్య బద్దంగా హక్కుల కోసం పోరాడే విద్యార్థి సంఘాల నాయకులను ఢిల్లీ పోలీసులు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (AIDSO), డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (DSU), భగత్ సింగ్ అంబేద్కర్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (BASO), మరియు అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ASA) లు సంయుక్తంగా ప్రకటించాయి. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యలు అని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. విద్యార్థి సంఘాల నాయకుల కిడ్నాప్ , నిర్భంధంపై విచారణ జరపాలని ఆ సంఘాలు డిమాండ్ చేశాయి. మనువాద, మతతత్వ ,కార్పొరేట్ శక్తుల ను వ్యతిరేకిస్తున్న వారిని చట్ట విరుద్ధంగా నిర్బంధించి చిత్ర హింసలకు గురిచేస్తున్నారని ఆ ప్రకటనలో తెలిపాయి.జూలై 9 నుండి జూలై 12 వరకు, ఢిల్లీ పోలీసులు అనేక మందిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. పోలీసుల నిర్భంధంలో ఉన్న వారి పేర్లను ఆ ప్రకటనలో తెలిపాయి. నిర్బంధించబడిన వారిలో డెమోక్రటిక్ రైట్స్ కార్యకర్తలు ఎహ్ తమామ్మ్ , బాదల్ (కార్పొరేషన్ & మిలిటరైజేషన్కు వ్యతిరేకంగా ఫోరం), విద్యార్థులు గుర్కీరత్, గౌరవ్ , గౌరంగ్ (భగత్ సింగ్ స్టూడెంట్ యూనిటీ ఫోరం), వలరిక (నజారియా మ్యాగజైన్) , సామాజిక కార్యకర్త సామ్రాట్ సింగ్ లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. వీరందరినీ డిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో
చట్ట విరుద్ధంగా ఉంచినట్లుగా తెలిపాయి. వారందరినీ అనేక మైన చిత్రహింసలకు గురిచేస్తున్నారని తెలిపాయి మహిళా నాయకులు లైంగిక హింసలకు గురిచేస్తున్నట్లుగా తెలిసిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు వ్యక్తి స్వేచ్ఛకు భంగకరం అని ఆ ప్రకటనలో ఖండించారు.మరో వైపు జాకీర్ హుస్సేన్ కళాశాల (ఢిల్లీ విశ్వవిద్యాలయం)లో తత్వశాస్త్ర విద్యార్థి రుద్ర జూలై 19 ఉదయం నుండి కనిపించకుండా పోయినట్లు అందులో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిని అర్బన్ నక్సలైట్ గా ముద్రవేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఢిల్లీ పోలీసులు హోం మంత్రి అమిత్ షా ఆదేశాలను పాటిస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. కిడ్నాప్ కు గురైన నాయకులకు కార్యకర్తలకు తాము పూర్తి సంఘీభావం తెలుపుతున్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి.విద్యార్థులను శత్రువులుగా చూస్తూ భయంకరమైన అణచివేతకు గురిచేస్తున్నారని ఆరోపించాయి.
……………………………