
* కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై రేవంత్ ఫైర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఓ సారి చదివి మాట్లాడాలని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టంలో ఏబీసీడీ వర్గీకరణ లేదని స్పష్టం చేశారు. బీసీఈకి ఇప్పటికే 4శాతం రిజర్వేషన్లు ఉన్నాయని తేల్చిచెప్పారు. కొత్తగా పదిశాతం రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని రేవంత్ ప్రశ్నించారు. రాష్ట్రపతి బిల్లును ఆమోదించేలా ఒత్తిడి తెస్తామన్నారు. ఒక వేళ రాష్ట్రపతి బిల్లు ఆమోదించకపోతే ప్రధాని ఒత్తిడి మేరకే బిల్లు ఆమోదించలేదనేది స్పష్టమవుతుందన్నారు. 42శాతం రిజర్వేషన్ల అమలుకు ఉన్న అన్ని మార్గాలను ప్రయత్నించామని చెప్పుకొచ్చారు.బీసీ రిజర్వేషన్లపై ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.తమ కమిట్మెంట్కు బీజేపీ సర్టిఫికెట్ అవసరం లేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు తమ దగ్గర 3 మార్గాలు ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే వరకు వేచి చూస్తామని పేర్కొన్నారు.జీవో ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లమని తెలిపారు. పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లమని అన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ఇతర పార్టీలపైనా ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. కోర్టు చెప్పినట్టే సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. మరోవైపు ఇవాళ(గురువారం) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ సమావేశం అయ్యారు. పార్లమెంటులోని మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు కలిశారు.
…………………………………………….