* హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
ఆకేరు న్యూస్, హనుమకొండ: గ్రేటర్ వరంగల్ పరిధిలో నాలాలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈనెల 17న హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి నాలాలు, చెరువులు,ప్రభుత్వ భూముల ఆక్రమణల అంశాన్ని తీసుకువెళ్లారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు, సూచనల మేరకు గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, రెవెన్యూ, మున్సిపల్, సాగునీటి పారుదల, కుడా, టౌన్ ప్లానింగ్, ఆర్ అండ్ బి, తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాలాలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణల గురించిన వివరాలను ఆయా శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ నగరంలో నాలాల అభివృద్ధి, విస్తరణకు ప్రణాళికల రూపకల్పన చేయడానికి సర్వే నిర్వహించాలన్నారు. ఆక్రమణలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, తహసీల్దార్లు బావ్ సింగ్, కుడా పి.వో అజిత్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈ ఈ సురేష్ బాబు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
…………………………