ఆకేరు న్యూస్, డెస్క్ : ఉద్రిక్తతలు.. తీవ్ర సంక్షోభం నుంచి సాధారణం దిశగా నేపాల్ పరిస్థితులు కొంచెం కొంచెం మారుతున్నాయి. జన్-జెడ్ ఉద్యమకారుల డిమాండ్ మేరకు ఆ దేశ పార్లమెంట్ ను రద్దు చేశారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, సుశీలా కర్కి, యువ ఆందోళనకారుల మధ్య జరిగిన చర్చల అనంతరం తాత్కాలిక ప్రధాని ఎవరనేది కూడా తేలిపోయింది. ఉద్యమకారుల్లో మెజార్టీ మంది సిఫారసు చేసిన మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కిను తాత్కాలిక ప్రధానిగా ఎంపిక చేశారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఆమోదం కోసం పంపారు. కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎవరీ సుశీలా కర్కీ
నేపాల్ లో ఉన్న రాజకీయ సంక్షోభాన్ని ఆమె అయితేనే సరిదిద్దగలరని సుశీల కర్కిని ప్రధానిగా ఎంపిక చేశారు. ఈక్రమంలో ఆమె ఎవరు.. ఏంటి అనే ఆసక్తి సర్వత్రా ఏర్పడింది. 72 ఏళ్ల వయసులో సంక్షోభ దేశానికి ప్రధానిగా ఎంపిక చేశారంటేనే ఆమె సమర్థతను అర్థం చేసుకోవచ్చు. సాధారణ ఉపాధ్యాయురాలుగా కెరీర్ ప్రారంభించిన సుశీలా కర్కీ.. అంచలంచెలుగా ఉన్నత స్థానాలను అధిరోహించారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి న్యాయవాద వృత్తిలోకి మారారు. నిర్భయంగా వృత్తి ధర్మాన్ని పాటిస్తూ , 2009లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టారు. శాశ్వత న్యాయమూర్తిగా ఎదిగారు. 2016 తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత రాజ్యాంగమండలి సిఫార్సు మేరకు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించారు. నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు. దేశంలో జరిగిన హింసాత్మక ఆందోళనల తర్వాత సుశీల కర్కిని తాత్కాలిక ప్రధానిగా ఎంపిక చేయడం సమస్యకు పరిష్కారంగా భావిస్తున్నారు. సుశీలా కర్కి ఈరోజు రాత్రి 8.45 గంటలకు ఆమె నేపాల్ అధ్యక్షుడి అధికారిక నివాసం ‘శీతల్ నివాస్’లో పదవీ ప్రమాణస్వీకారం చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.
………………………………..
