* కల్తీ పాలే కారణమా ..?
* అనూరియా వ్యాధిగా గుర్తింపు
* పాల నమూనాలను ల్యాబ్క పంపించాం : జిల్లా కలెక్టర్
ఆకేరు న్యూస్ , అమరావతి : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాల కలకలం రేపుతోంది. ఇప్పటికే ఐదుగురు మృతి చెందిగా మరో పది మందికి పైగా అస్వస్థతకు లోనై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీనికి కారణం కల్తీ పాలే కారణమని భావిస్తున్నారు.. దీంతో పాల వ్యాపారి గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాలల్లో ఏదైనా విష పూరిత రసాయనం కలిసిందా..? పాలను కల్తీ చేసే ప్రక్రియలో భాగంగా ఏదైనా రసాయనిక పదార్థం కలిసిందా..? లేదా ఇందులో ఏదైనా కుట్ర కోణం కూడా ఉందా అన్న అను మానంతో పోలీసులు గణేశ్ ను విచారిస్తున్నారు.
*నలుగురి మృతి , పలువురికి అస్వస్థత
గణేష్ అనే పాల వ్యాపారి వినియోగదారులే బాధితులుగా ఉండడంతో పాలల్లోనే ఏదో విష పూరితమైన రసాయనం కలిసి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే చౌడేశ్వరి నగర్ కు చెందిన తాడి కృష్ణవేణి, లాలా చెరువు చెందిన కనక రత్నం, దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన యాళ్ళ శేషగిరిరావు మృతి చెందారు మరో 12 మంది నగరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
* గేదెల పాల నుంచి నమూనాలను సేకరించాం
కల్తీ పాల వల్ల జరుగుతున్న నష్టాన్ని అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం యుధ్ద ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఇంటింటా సర్వే నిర్వహించి నగరంలో 73 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. అనుమానిత పాల వ్యాపారికి చెందిన 42 గేదెల పాల నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ల్యాబ్‌లకు పంపారు.ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సోమవారం జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి మీడియా కు తెలిపారు ..
ఇదే విషయమై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీ క్షా సమావేశం నిర్వహించారు. . ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యకు మూల కారణాలను గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట ఉన్నతాధికారులు కూడా క్షేత్ర స్థాయికి వెళ్ళి పర్యవేక్షించాలన్నారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ఈ సమస్యకు సంబందించిన లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
* అనూరియా అంటే ఏమిటి?
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గత కొద్దిరోజులుగా కలకలం రేపుతున్న వింత వ్యాధి
. ప్రాథమిక లక్షణాలను బట్టి దీన్ని ‘అనూరియా(Anuria) అనే వ్యాధిగా గుర్తించారు. సాధారణంగా ఒక ఆరోగ్యవంతుడైన మనిషి రోజుకు తగినంత మూత్రాన్ని విసర్జిస్తారు. మూత్రపిండాలు మూత్రాన్ని ఉత్పత్తి చేయడం ఆపేస్తాయి. వైద్య పరిభాషలో చెప్పాలంటే, 24 గంటల వ్యవధిలో మూత్రం పరిమాణం 100 మి.లీ కంటే తక్కువగా ఉంటే దానిని అనూరియాగా పరిగణిస్తారు. ఇది కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నాయనడానికి సంకేతం అని యూరాలజిస్ట్ లు అంటున్నారు.
*ఈ వ్యాధి సోకిన వారిలో కనిపించే ప్రధాన లక్షణాలు ఇవే :
రోజంతా ఒక్క చుక్క కూడా మూత్రం రాకపోవడం. శరీరంలో ద్రవాలు పేరుకుపోవడం వల్ల కాళ్లు, చేతులు, ముఖం ఉబ్బిపోతాయి. నీరసం: తీవ్రమైన అలసట మరియు వాంతులు.
రక్తంలో వ్యర్థాలు పెరిగిపోవడం వల్ల అయోమయంగా అనిపించడం. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడం.
* మరీ .. ఎందుకు వస్తుంది?
కిడ్నీలకు రక్త ప్రసరణ తగ్గడం వల్ల వస్తుంది. అతిసారం (Diarrhea), డీహైడ్రేషన్ లేదా రక్తపోటు పడిపోవడం వల్ల ఇది సంభవిస్తుంది. కిడ్నీలో నేరుగా సమస్య తలెత్తడం. విషతుల్యమైన ఆహారం, కలుషితమైన పాలు లేదా రసాయనాలు శరీరంలోకి చేరడం వల్ల కిడ్నీ పనితీరు ఆగిపోవచ్చు. రాజమహేంద్రవరం కేసులో పాలు లేదా ఆహారం కలుషితం అయ్యాయా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
===============================
