ఆకేరు న్యూస్, డెస్క్:
ఐసీసీ T20 వరల్డ్ కప్‌లో భాగంగా శ్రీలంకలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన భారత్ vs పాక్ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు శివమెత్తారు. భారత ఆల్ రౌండ్ ప్రదర్శనకి పాకిస్తాన్ చేతులెత్తేసి 61 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు భారత జట్టుకు మద్దతుగా హర్ హర్ మహాదేవ్ అనుకుంటూ క్రికెట్ మ్యాచ్ ను చూసారేమో భారత్ పాకిస్తాన్ కి కాలరాత్రిని మిగిల్చింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ను ఎంచుకుంది. స్పిన్ అనుకూలమైన పిచ్‌పై 20 ఓవర్లలో భారత్ 175/7 స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 40 బంతుల్లో 77 రన్స్ చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.మొదటి నుంచే బౌండరీలు కొడుతూ భారత్‌కు బలమైన పునాది వేశాడు.సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 32, శివమ్ దూబే నాటౌట్‌గా 17 బంతుల్లో 27, తిలక్ వర్మ 25 రన్స్ చేసి టీమ్ స్కోరును 170కి పైగా తీసుకెళ్లారు. పాకిస్తాన్ యువ స్పిన్నర్ సైమ్ అయూబ్ 3-25తో బెస్ట్ బౌలర్ అయ్యాడు, కానీ మిగతా బౌలర్లు భారత్ దాడిని ఆపలేకపోయారు. జస్ప్రీత్ బుమ్రా పవర్‌ప్లేలో రెండు వికెట్లు తీసి టాప్ ఆర్డర్‌ను కూల్చాడు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా ప్రతి ఒక్కరూ రెండేసి వికెట్లు తీశారు. పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖాన్ 34 బంతుల్లో 44 రాణించినప్పటికీ మిగతా వారెవరు నిలబడలేకపోవడంతో పాకిస్తాన్ 18 ఓవర్లలో 114కి ఆలౌట్ అయింది. ఈ విజయం T20 వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్‌పై భారత్ సాధించిన అతిపెద్ద విజయం.
నో హ్యాండ్ షేక్
ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య హ్యాండ్‌షేక్ జరగలేదు. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేసే సమయంలో,మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ఇరు జట్ల ఆటగాళ్లు మధ్య గాని , కెప్టెన్ల మధ్య హ్యాండ్ షేక్ జరగలేదు.
బౌలింగ్ అద్భుతం
మ్యాచ్ అనంతరం కెప్టెన్లు మాట్లాడుతూ…బౌలర్లు ఈ పిచ్‌పై అద్భుతంగా బౌల్ చేశారు, ఇషాన్ ఇన్నింగ్స్ స్పెషల్. ఈ విజయం మాకు మునుముందుకు విశ్వాసం ఇస్తుంది అని భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జట్టును ప్రశంసించాడు. కాగా
మేము పరిస్థితులకు అనుగుణంగా అడాప్ట్ కాలేకపోయాము. భారత్ అన్ని విభాగాల్లో మమ్మల్ని అధిగమించారు అని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు.
