
* ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
ఆకేరున్యూస్, భూపాలపల్లి: అందివచ్చిన ప్రతి అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని తమ కాళ్లపై నిలబడాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాలులో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉపాధి కోసం ఇతర జిల్లాలకు సైతం వెళ్లాలని సూచించారు. జిల్లా కలెక్టర్ పంజాబ్ నుండి, ఎస్పి మహారాష్ట్ర నుండి వచ్చి మన జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారని, యువత. ఉన్న చోటనే ఉద్యోగం చేయాలన్న లక్ష్యాన్ని విడనాడాలని స్పష్టం చేశారు. జిల్లాలో సింగరేణి ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం సాధించడానికి శిక్షణా కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేక మద్యం, మత్తు పదార్థాలు కు బానిసలవుతున్నారని, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పన వల్ల జీవనోపాధి. లభిస్తుందని, తద్వారా ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారని తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగావకాశాలను కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగావకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళా యువత కెరీర్ కు ఎంతో దోహదపడుతుందని అన్నారు. 80కి పైగా వివిధ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొని నైపుణ్యాలను బట్టి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలన్నారు. భవిష్యత్? అంతా డిజిటల్ యుగంగా మారబోతోందని తెలిపారు. ఈనేపథ్యంలో వివిధ రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువతలో సాంకేతిక నైపుణ్యం పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. యువత ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేందుకు నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వం హైదరాబాద్?లో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందన్నారు. స్కిల్ యూనివర్సిటీ అనేది దేశంలో మరెక్కడా లేదని అన్నారు. భవిష్యత్‌లోనే జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ని అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. రాష్ట్ర ప్రగతిలో యువత భాగస్వామ్యం కావాలన్నారు. యువత భవిష్యత్తు కొరకు పరిశ్రమలను తీసుకురావడం ద్వారా లక్షలాదిమందికి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే సంకల్పంతో ఈ రోజు మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు, ఈ జాబ్ మేళా నిరంతరంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రతి ఆరు నెలలకొకసారి జాబ్ మేళాలు నిర్వహిస్తామని, వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ఎంపికైన నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం, శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా కృషి చేస్తామన్నారు. నిరుద్యోగ యువత ఆయా గ్రామాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ 80 పరిశ్రమ లు జాబ్ మేళాలో పాల్గొన్నారని, 10 వేల మందికి పైగా నిరుద్యోగులు ఆన్లైన్ ద్వారా నమోదు అయినట్లు తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కమిటీలు వేసి యువతకు సమాచారాన్ని చేరువ చేసినట్లు తెలిపారు. యువత అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంపెనీల్లో మన రాష్ట్రంలో ఏ జిల్లాలో అవకాశం కల్పించిన అక్కడికి వెళ్లి ఉద్యోగం చేసుకుంటూ తదుపరి మరింత ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. మొదటి ఉద్యోగం ఎంతో మధురానుభూతినిస్తోందని ఈ అవకాశాన్ని ఆసరా చేసుకుని మరిన్ని ఉద్యోగాల సాధనకు కృషి చేయాలని ఆయన సూచించారు.
………………………………………