Udhayanidhi Stalin on CM Vijay
* అసెంబ్లీని సినిమా హాల్‌గా మార్చేశారు
ఆకేరు న్యూస్, డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో వేడి ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. అసెంబ్లీ వేదికగా అధికార తమిళగ వెట్రి కజగం (TVK), ప్రతిపక్ష ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్.. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (CM Vijay) లక్ష్యంగా విరుచుకుపడ్డారు. అసెంబ్లీ నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సీఎం విజయ్ అసెంబ్లీని ఒక సినిమా హాల్లా, షూటింగ్ స్పాట్‌లా మార్చేశారని మండిపడ్డారు. “అసెంబ్లీలో కూడా విజయ్ నటించడం ప్రారంభించారు. ఆయన నటిస్తుంటే స్పీకర్ ‘కట్’ చెబుతున్నారు, మళ్లీ స్పీకర్ ‘యాక్షన్’ అనగానే విజయ్ నటన మొదలుపెడుతున్నారు. ఇదంతా సోషల్ మీడియాలో రీల్స్, ట్రెండ్స్ కోసమే చేస్తున్నారు” అంటూ ఎద్దేవా చేశారు.
* కార్వాన్, మేకప్ మ్యాన్‌ను కూడా తెస్తారేమో..
ఉదయనిధి తన విమర్శల డోస్ పెంచుతూ.. “ఇక రేపటి నుంచి అసెంబ్లీకి కార్వాన్, మేకప్ మ్యాన్, ఫైట్ మాస్టర్లను కూడా తీసుకొస్తారేమో. అసెంబ్లీలో మంత్రులు విజిల్స్ వేస్తున్నారు. ఇలాగే ఉంటే త్వరలో ఐటెం సాంగ్స్‌కు డాన్సులు కూడా వేసేలా ఉన్నారు” అంటూ తీవ్ర వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతలు, మహిళలపై జరుగుతున్న నేరాల గురించి తాము ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పలేక అధికార పక్షం ఇలాంటి డ్రామాలకు తెరతీసిందని ఉదయనిధి ఆరోపించారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో ‘పార్టీ ఫండ్స్’ పేరిట అవినీతి జరిగిందంటూ సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలపై డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడేందుకు స్పీకర్ సమయం ఇవ్వకపోవడంతో, డీఎంకే ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.
ప్రస్తుతం ఉదయనిధి చేసిన ఈ ‘షూటింగ్ స్పాట్’ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. ఈ ఘాటు విమర్శలపై సీఎం విజయ్ అలాగే టీవీకే (TVK) శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
