* తెలంగాణలో అపారమైన అవకాశాలు
* గ్లోబల్ సమ్మిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
విశ్వ యవనికపై తెలంగాణ ఖ్యాతి చాటేలా గ్లోబల్ సమ్మిట్ ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశ, విదేశాల నుంచి ఎందరో ప్రముఖులు, పారిశ్రామికేత్తలు ఈ సదస్సుకు విచ్చేశారు. సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్దిలో రాష్ట్రం దూసుకుపోతోందని, చైనా, పాన్ లాంటి పెద్ద దేశాలతోనే తమకు పోటీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామన్నారు. తమకు అంబేడ్కర్, మహాత్మగాంధీ స్ఫూర్తి అన్నారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి చేరాలన్నదే తమ లక్ష్యం అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 30 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం నిర్దేశించుకుందని చెప్పారు.
అభివృద్ధికి మూడు భాగాలు..
“దేశానికి స్వాతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి మనమేం సాధించగమో చెప్పాలని నిపుణులను కోరా. ఆ సమయంలోనే తెలంగాణ రైజింగ్-2047 దార్శనికతకు బీజం పడింది. తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. మంచి సానుకూల వాతావరణం ఉంది. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మేం సంకల్పించాం. దేశ జీడీపీలో తెలంగాణ నుంచి దాదాపు 5% వాటాను అందిస్తున్నాం. 2047 నాటికి భారతదేశ GDPలో 10% వాటాను తెలంగాణ నుంచి అందించాలన్నది మా లక్ష్యం. సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం… ఇలా తెలంగాణను స్పష్టమైన 3 భాగాలుగా విభజించాం. మూడు భాగాలుగా విభజించి ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించుకున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం” అని రేవంత్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా వివరించారు. చైనాలోని గ్వాంగ్-డాంగ్ ప్రావిన్స్ 20 సంవత్సరాల్లో ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధి రేటును సాధించారని, తెలంగాణలో కూడా తాము అదే నమూనాను అనుసరించాలని భావిస్తున్నామని వివరించారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి మేమెంతో ప్రేరణ పొందాం. ఇప్పుడు మేం ఆ దేశాలతో పోటీ పడాలనుకుంటున్నామని స్పష్టం చేశారు.
………………………………………………….
