ఆకేరు న్యూస్, హనుమకొండ : తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం జరిగిన బడ్డెట్ సమావేశాలు వాడీ వేడిగా సాగాయి. ముఖ్యంగా ప్రతిపక్ష సభ్యులు ప్రవర్తించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సీనియర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి విషయంలో వ్యవహరించి విధానం ఆ పార్టీ సభ్యుల సస్పెన్షన్‌కు దారితీసింది. అలాగే బీఆర్ ఎస్ హాయంలో జరిగిన భూకబ్జాలపై అధికార పక్షం సభ్యులు చర్యలకు డిమాండ్ చేయడం సభలో వేడి పెరిగింది.
ఎవరేమన్నారంటే..
తప్పుడు విధానాలు ప్రోత్సహిస్తున్నారు..
– ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి
సహచర సీనియర్ శాసనసభ్యుడి విషయంలో అవహేళనగా మాట్లాడడమే కాకుండా.. చెయ్యితోటి నిన్ను కాల్చేస్తా అనేలా సంబోధించిన కౌశిక్ రెడ్డిని నియంత్రించేది పోయి.. హరీష్ రావు, కేటీఆర్ ఒక రకంగా ప్రోత్సహించడం దురదృష్టకరమైన సంఘటన. నేను రెండు హౌస్ కమిటీలకు చైర్మన్‌గా పని చేశాను. నాకు తెలిసినంత మట్టుకు హౌస్ కమిటీ అనేది హౌస్ కు రిపోర్టు సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ నిర్దిష్టంగా దాని మీద చర్యలు తీసుకోవాలి.. కానీ ఎక్కడా సక్రమంగా లేదు. అదే సీబీసీఐడీ విచారణ చట్టపరమైన వ్యవస్థ. అది మొత్తం పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత అందులో వచ్చిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని కేసులు పెట్టవచ్చు, చర్యలు తీసుకోవచ్చు. మరి సీనియర్ శాసనసభ్యులైన హరీష్ రావుకు ఈ చిన్న విషయం తెలియదని చెప్పి నేను అనుకోవడం లేదు. ఇప్పటికైనా హౌస్‌కు సహకరించాలి. వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తప్పు చేయకపోతే హౌస్ కమిటీకి ఒప్పుకోవాలి
– ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రాష్ట్రంలో అనేక రకాల భూ కబ్జాలు జరిగాయి. భూ దోపిడి జరిగింది. నాడు అధికారంలో ఉన్న వాళ్ళందరూ ధరణిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా వందలాది ఎకరాల భూములను కబ్జా చేశారు. బాలానగర్ లో ధరణిని అడ్డం పెట్టుకుని కంపెనీ యజమానులను బెదిరించి భూ బదిలాయింపులు చేయించుకున్నారు. దానిపైన హౌస్ కమిటీకి అనుమతి ఇవ్వండి. తప్పు చేయకపోతే వారు హౌస్ కమిటీకి ఒప్పుకోవాలి.. సభ్యులు ప్రవర్తిస్తున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కొంతమంది సభ్యులు సిగ్గు లేకుండా శాసన సభ్యులం అనే విషయాన్ని కూడా మర్చిపోయి అరుస్తున్నారు. ఇది సభ సంప్రదాయాలకు మంచిది కాదు. దయచేసి వాళ్ళని నియంత్రించాలని కడియం శ్రీహరి కోరారు.
కబ్జా నిరూపించకపోతే రాజీనామా చేస్తా..
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
బీఆర్ఎస్ వాళ్లు హనుమకొండ సిటీ సెంటర్లో రూ.200 కోట్ల ఆస్తి పార్టీ కార్యాలయం కోసం కబ్జా చేసిండ్లు.. నిరూపించకుంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. నిరూపిస్తే కేటీఆర్, హరీశ్‌రావు రాజీనామా చేస్తారా.. కబ్జాలు పెట్టిన విషయాన్ని ఇన్ఫర్మేషన్ ఆక్ట్ ప్రకారం ఆధారాలతో చూపిస్తూ మీడియాలో, అసెంబ్లీలో మొత్తుకుంటున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. పాపం పోనీ అని కక్ష సాధింపు చర్య వద్దని ముఖ్యమంత్రి వదిలేయడం వల్లే ఈ దొంగల ముఠాలు దేశం మీద దాడి చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కబ్జాభూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.. అక్రమాలపై సిబిసిడితో విచారణ చేయించాలి.. హౌస్ కమిటీలో పెట్టాలి అని డిమాండ్ చేశారు.
