* భారీగా నిధుల కేటాయింపు
* కీలక ప్రాజెక్టులు దిశగా అడుగులు
* జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యమా?
అకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసీటూ ఇక్కడ గెలవకపోయినా.. అభివృద్ధికి బాటలు వేస్తుండడం ఆసక్తిగా మారింది. ఫ్యూచర్ సిటీ పేరుతో మరోనగరం రూపకల్పన చేస్తూ.. ఆ సిటీకి జీహెచ్ఎంసీని చేరువ చేసింది. దేశంలోనే అతిపెద్ద నగరంగా మార్చేసింది. విస్తరించడమే కాదు.. భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా అభివృద్ధి చేపట్టేందుకు చర్యలు చేపడుతోంది. అందుకోసం వేలాది కోట్ల రూపాయల నిధులను వెచ్చించేందుకు సిద్ధం అవుతోంది.
4 కీలక ప్రాజెక్టులు. రూ.2,280 కోట్లు
మహానగరాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య ట్రాఫిక్. దాని పరిష్కారానికి ప్రభుత్వం నాలుగు కీలక ఫ్లాగ్షిప్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు కనెక్టివిటీ పెంచడం, వివిధ ప్రాంతాల్లో నెలకొన్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ఆయా ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రూ.2,280 కోట్ల పనులకు పాలనా పరమైన అనుమతులను ఇప్పటికే మంజూరు చేసింది. త్వరలోనే టెండర్లను ఆహ్వానించనుంది.
ఎలివేటెడ్ కారిడార్
ప్రధానంగా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 నుంచి ఫిలింనగర్, టీహబ్ మీదుగా గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ వరకు ఎలివేటెడ్ కారిడార్‌ను రూ.1,656 కోట్లతో నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టడంతో పాటు నగరం నడిబొడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు వేగంగా చేరేందుకు వీలుగా ఈ కారిడార్ ద్వారా వీలు ఉంటుంది. ఈ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేను బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 నుంచి ఫిలీంనగర్, జడ్జీస్ కాలనీ, దుర్గంచెరువు, టీ హబ్, శిల్పా లేఅవుట్ మీదుగా ప్రతిపాదించారు. ఔటర్ రింగ్ రోడ్డు గచ్చిబౌలి చౌరస్తా మీదుగా శిల్పా లేఅవుట్ సమీపంలో వరకు వచ్చే ప్లైఓవర్ వరకు ఈ కారిడార్ రానుంది. ఔటర్ నుంచి వచ్చేవారు నేరుగా నగరంలోకి చేరేందుకు.. నగరంలోనివారు నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు చేరేందుకు ఈ సరికొత్త రహదారి దోహదపడనుంది.
ట్రంపెట్ ఫ్లైఓవర్
బుద్వేల్ లేఅవుట్‌తో పాటు ఔటర్ రింగ్ రోడ్డుకు రేడియల్ రోడ్డు-2ను అనుసంధానం చేయడానికి మరో ట్రంపెట్ ఫ్లైఓవర్‌ను నిర్మించనుంది. దీని కోసం రూ.488 కోట్లు కేటాయించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపకల్పన చేసిన ఈ ఇంటర్చేంజ్ హైదరాబాద్‌కు ఒక ప్రతిష్టాత్మక ల్యాండ్‌మార్క్ గేట్వేగా మారనుంది. ఈ ఇంటర్‌ఛేంజ్‌తో బుద్వేల్-కొస్గికి సరికొత్తగా నిర్మాణం చేయనున్న రేడియల్ రోడ్డు -2కు సులువుగా రాకపోకలు జరగనున్నాయి. అటు ఎయిర్‌పోర్టు మార్గంలో, ఇటు కోకాపేట వైపు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సులువుగా ప్రయాణం చేయవచ్చు.
మరో రెండు..
మణికొండ, ఔటర్ అవతార్ మీదుగా శంకర్పల్లి రోడ్డులోని ఎంజీఐటీ వరకు గల గండిపేట కాండూట్ పైపులైన్ రోడ్డును రూ.110కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే.. నానక్‌రాంగూడ నుంచి గచ్చిబౌలి వరకు ఎడమ వైపు గల రహదారిని మూడు లేన్ల నుంచి నాలుగు లేన్లకు విస్తరించనుంది. రూ.26కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం పాలన అనుమతులు జారీ చేసింది. కొద్ది నెలల్లో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు పావులు కదుపుతుందనే ప్రచారం జరుగుతోంది.
…………………………………………………
