ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బ్రహ్మాండమైన మెజారిటీతో అద్భుత విజయాన్ని అందుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబునాయుడుకు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫోన్ చేశారు. శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ట్విట్టర్ (ఎక్స్) లో చంద్రబాబుకు (Chandrababu) శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ .. ఇవాళ నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. కొత్తగా ఏర్పాటు చేసే ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ సంకేతాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై సూచాయంగా ప్రస్తావించినట్లు తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలని పేర్కొన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి కలిసి రావాలని చంద్రబాబును రేవంత్ కోరారు. దీంతో చంద్రబాబు కూడా కలిసి పనిచేసేందుకు సిద్ధమని చెప్పినట్లు తెలిసింది. అలాగే విభజన సమస్యల్ని కూడా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకునేందుకు సిద్ధమన్నారు. మరోవైపు ఈ నెల 12న జరిగే తన ప్రమాణస్వీకారానికి రావాలని కూడా చంద్రబాబు రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తే వెళ్తానని ఇప్పటికే రేవంత్ రెడ్డి వెల్లడించారు.
——————–