Indian Doctor Global Award
* ప్రపంచ వేదికపై మెరిసిన భారతీయ డాక్టర్.. అమెరికాలో జెస్సీ జాక్సన్ అవార్డు సాధించిన తొలి భారతీయుడిగా రికార్డ్
ఆకేరు న్యూస్, డెస్క్: భారతీయ వైద్య రంగ ఖ్యాతి మరోసారి ప్రపంచ వేదికపై మారుమోగింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రభు కుమార చల్లగాలి ప్రతిష్టాత్మకమైన “రెవరెండ్ జెస్సీ ఎల్. జాక్సన్ లీడర్షిప్ అవార్డు”ను కైవసం చేసుకున్నారు. అమెరికాలోని చికాగోలో జరిగిన ‘గ్లోబల్ ఐ మాక్సిన్ ఉమెన్స్ హిస్టరీ మంత్ సెలబ్రేషన్స్ 2026’ వేడుకల్లో భాగంగా ఆయనకు ఈ అరుదైన గౌరవం దక్కింది.
* కీలక వివరాలు:
అమెరికన్ మల్టీ ఎత్నిక్ కమిషన్ (AMEC) మరియు యూఎస్ కాంగ్రెస్ మెన్ డేనీ కె. డేవిస్ ఆధ్వర్యంలో జరిగిన 6వ వార్షిక గ్లోబల్ ఐ మాక్సిన్ వేడుకల్లో ఈ పురస్కారాన్ని అందజేశారు. మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తున్నందుకు గాను డాక్టర్ ప్రభు కుమార్ గారిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. మన దేశం నుండి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి ఈ అవార్డును అందుకున్న తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు.
* హాజరైన ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో చైనా కౌన్సిలేట్ జనరల్, గ్లోబల్ ఐ మాక్సిన్ చైర్మన్ డాక్టర్ విజయ్ ప్రభాకర్, ఇల్లినాయిస్ గవర్నర్ ప్రతినిధులు, మరియు 7వ సీడీ డెమోక్రటిక్ నామినీ లా షాన్ కె. ఫోర్డ్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రభు కుమార చల్లగాలి మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి గొప్ప పురస్కారం రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది తన బాధ్యతను మరింత పెంచిందని, నిస్వార్థ సేవను కొనసాగిస్తానని పేర్కొన్నారు.
